తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ఇబ్రహీంపట్నం రూరల్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ (కలెక్టరేట్) ఆవరణలో మంగళవారం తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మమేకమయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ అధికారులు ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అందేలా చూడాలన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతోపాటు సాంస్కృతిక కళాకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, డీపీఓ సురేష్ మోహన్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని బీఎస్‌ఐటీ కళాశాలలో జరుగుతున్న పీఓ, ఏపీఓల శిక్షణ తరగతులను మంగళవారం మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి తనిఖీ చేశారు. శిక్షణ తరగుతులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సందేహాలు వచ్చినా ఇక్కడే నివృత్తి చేసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజు పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమనిబంధనలను వివరించారు. పోలింగ్ రోజునే కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ట్రైనర్స్ ఆశీర్వాదం, బాలాజీ, శ్రీధర్, ఎంఈఓ పురన్‌దాస్ పాల్గొన్నారు.
ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ
మొయినాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్ రైతు వేదికలో మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రొసీడింగ్ అధికారి, 19 గ్రామాలకు 19 ఆర్‌వోలను కేటాయించడం జరిగిందని తెలిపారు. 14న జరిగే పోలింగ్‌లో పాల్గొనే ప్రొసీడింగ్ అధికారులు, ఆర్వోలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ను ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సీల్ చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


