వైద్య విద్యార్థుల ధర్నా విరమణ
సమస్యల పరిష్కారానికి డీఎంఈ హామీ
ఇబ్రహీంపట్నం రూరల్: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థులు డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) శివరామప్రసాద్ హామీతో శాంతించారు. రెండో రోజైన మంగళవారం వీరు నిర్వహించిన ధర్నాకు జూడాల సంఘం, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి పరిసరాలు అడవులను తలపిస్తున్నాయని, కనీసం తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొడంగల్‌లో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, ఇక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డీఎంఈ శివరామప్రసాద్ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. క్యాంపస్‌లోనే హాస్టల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల రక్షణ కోసం సెక్యూరిటీ, పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ మొబైల్ తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం కోసం క్యాంపస్ నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు మాసాల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పేరెంట్స్ కమిటీ, జూడాలతో కలిసి విద్యార్థులను శాంతింపజేసి, సమ్మెను విరమింపజేశారు. పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50వేల మంది పేరెంట్స్‌తో మహేశ్వరం మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్ కుమార్, కోశాధికారి రవికుమార్, సంయుక్త కార్యదర్శి రత్నప్రసాద్ ఉన్నారు.


