ఓవర్ లోడింగ్‌పై చర్యలు తీసుకోండి
న్యూస్‌రీల్
తుర్కయంజాల్: ఓవర్ లోడింగ్ పేరుతో భారీ స్థాయిలో అక్రమ రవాణ జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్య ఆరోపించారు. ఈ మేరకు సోమవారం మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సుశీల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం యాదయ్య మాట్లాడుతూ.. ఆర్టీఓ పరిధిలో జరుగుతున్న అక్రమ రవాణాతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూరుతోందని అన్నారు. రహదారులపై మట్టి, కంకర పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం నుంచి కూడా అధికారులు గుణపాఠం నేర్చుకోలేదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్‌ల విషయంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శివకుమార్ గౌడ్, మున్సిపాలిటీ కార్యదర్శి కాటం రాజు తదితరులు పాల్గొన్నారు.


