జీహెచ్‌ఎంసీ వార్డులు
300
● పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
● ముందే చెప్పిన ‘సాక్షి’
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీక్యూర్) వరకు విస్తరించిన నేపథ్యంలో వార్డుల సంఖ్యను ప్రభుత్వం 300గా నిర్ణయించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా–అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ గురువారం జీవో(నెంబర్266), నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యయనం మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సమర్పించిన ‘వార్డ్ రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్‌వర్క్’ నివేదికను పరిశీలించిన అనంతరం, ఇటీవల విలీనం చేసిన 27 అర్బన్ లోకల్ బాడీల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వార్డులను 300కు పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం– 1955లోని నిబంధనల ప్రకారం దఖలు పడ్డ అధికారంతో, జీహెచ్‌ఎంసీ వార్డుల మొత్తం సంఖ్యను 300గా నిర్ణయిస్తూ అసెంబ్లీకి, అలాగే ప్రజలకు తెలియజేస్తూ ప్రభు త్వం ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఎక్స్‌ట్రార్డినరీ గెజిట్‌లో ప్రచురించాలనీ, 500 ప్రతులను ముద్రించి ప్రభుత్వానికి అందజేయాలనీ ప్రింటింగ్ స్టేషనరీ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ వార్డులు 150 నుంచి 300 వరకు పెరగనున్నాయని గత నెల 29వ తేదీనే ‘సాక్షి’ ప్రచురించిన విషయం తెలిసిందే.


