సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వగ్రామంలో సర్పంచ్‌లుగా ఎన్నికై ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలుగా రాణించారు. వీరు ఇద్దరూ 1980లో సర్పంచ్‌లుగా గెలుపొంది ఇద్దరూ మూడుసార్లు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు.
నిర్మల్ పురస్కార్ అవార్డు ఘనత
నియోజకవర్గ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిది అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, తొర్రూర్ స్వగ్రామం. విద్యార్థిదశ నుంచే చురుగ్గా ఉండడంతో ఆయనకు ఓటు హక్కు వచ్చిన ఏడాది 1980లోనే తొర్రూర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించారు. ఆయన సర్పంచ్‌గా పని చేసిన కాలంలో గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఘనత దక్కింది. తదనంతరం నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలో చేరి 1994లో మలక్‌పేట్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో కాంగ్రెస్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తదనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు సార్లు పొటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2023లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లుగా సేవలందిస్తున్నారు.
బాబాయ్‌పై గెలుపు
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతుండగా గ్రామానికి చెందిన పెద్దలు ఆయన్ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. 1980లో సర్పంచ్ ఎన్నికల్లో సొంత బాబాయ్‌పై గెలుపొందాడు. సర్పంచ్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాడు. తదనంతరం టీడీపీలో చేరి వివిధ పదవులను అలంకరించాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2014లో రెండో సారి టీడీపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలిచాడు. 2018లో టీఆర్‌ఎస్ నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి ఇబ్రహీంపట్నం ప్రజలకు సేవలందించాడు. 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు.
మంచిరెడ్డి, మల్‌రెడ్డి తొలుత ప్రథమపౌరులే..
ఇద్దరూ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేలు
తొలి ఓటు తనకే వేసుకున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యం
కష్టపడి పని చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. రాజకీయాల్లో స్థిరత్వం అవసరం. టీడీపీ రాజకీయ భవిష్యత్ ఇస్తే కాంగ్రెస్ జీవితం ఇచ్చింది. పార్టీని నమ్ముకుని ఉండటం వల్లే నేడు మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్థిరత్వంగా, నిలకడగా ఉండాలి. ప్రజలను నమ్ముకుని ఉండాలి. స్వార్థం లేకుండా పని చేశాం. అప్పట్లో ఓట్ల కోసం ఖర్చులు సైతం తక్కువే. ఇప్పుడు రాజకీయాలు ఫిరం అయ్యాయి. – మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
నిస్వార్థంగా సేవలందించాం
ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామానికి సర్పంచ్‌గా 1980లో పని చేశాను. అప్పట్లో యువకుడిగా ఉన్న సమయంలో ప్రజలు అవకాశం కల్పించారు. నిస్వార్థంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఎదిగాను. నిరంతరం ప్రజలతోనే ఉండటం వల్ల మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. స్వార్థం లేని జీవితంతో ముందుకు పోతే అవకాశాలు వస్తాయి. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా
సర్పంచ్ నుంచి శాసనసభ్యులుగా


