తాళం వేసిన ఇంటికి కన్నం
● ఇద్దరు పాత నేరస్తులకు రిమాండ్
● వివరాలు వెల్లడించినఏసీపీ లక్ష్మీనారాయణ
షాద్‌నగర్‌రూరల్: జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణంలోని పీఎస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా రామయ్యగూడకు చెందిన సురేందర్, తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన నర్సింలు జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడిన వీరు మల్లీ చోరీల బాటపట్టారు. పట్టణంలోని ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే కొండె కృష్ణయ్య ఈ నెల 3న తన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం, చిన్నరేవళ్లికి వెళ్లాడు. అదే రోజు సాయంత్రం కృష్ణయ్య భార్య ఇంటికి తాళం వేసి టైలర్‌షాప్‌నకు వెళ్లింది. ఇది గమనించిన సురేందర్ తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బంగారం, నగదు దోచుకెళ్లాడు. చోరీ విషయంపై బాధితుడు కృష్ణయ్య అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు. సురేందర్ చోరీ చేసిన సొత్తును నర్సింలు కుదువపెట్టి ఇద్దరూ కలిసి జల్సాలు చేసేవారు. వీరు గతంలో ఎల్బీనగర్, మేడిపల్లి, సరూర్‌నగర్, చైతన్యపురి, బాలనగర్, చంద్రాయన్‌గుట్ట, భువనగిరి, గద్వాల, విజయనగర్, విరాకాబాద్, ఘట్కేసర్, సంగారెడ్డి, తిరుపతి, సైదాబాద్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారు. నిందితుల వద్ద ఒక బైక్, 3.2 తులాల బంగారం, రూ.62,600 నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఐ శివారెడ్డి, సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.


