క్రైం కార్నర్..
దోపిడీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
శంకర్‌పల్లి: ఓ దారి దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం చేవెళ్ల జిల్లా కోర్టు ఐదు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన జల్‌పేట్ శ్రీకాంత్(28), జల్‌పేట్ అలివేలు(26) బంధువులు. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించారు. ఇద్దరూ కలిసి 2023 నవంబర్ 12న పటాన్‌చెరులో శంకర్‌పల్లికి వెళ్లేందుకు రూ.2 వేలకు ఆటో మాట్లాడుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ మొయినొద్దీన్‌తో కలిసి మండలంలోని టంగటూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌పై దాడి చేసి, అతని వద్దనుంచి ఆటో, రూ.11వేల నగదు, సెల్‌ఫోన్ దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 14న నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి ఆటో, సెల్‌ఫోన్, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి, వాదనలు విన్న చేవెళ్ల ఫస్ట్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జి యు.విజయ్ కుమార్ నిందితులిద్దరికీ 5నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సోమవారం నిందితులకు శిక్ష పడడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను నార్సింగి ఏసీపీ రమణగౌడ్ అభినందించారు.
మహిళతో అసభ్య ప్రవర్తన: వ్యక్తికి రిమాండ్
కడ్తాల్: మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని కడ్తాల్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన విస్లావత్ శంకర్ వ్యక్తి, ఈనెల 2న రాత్రి సమయంలో, అదే తండాకు చెందిన మహిళతో అసభ్యంగా వ్యవహరించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామంలో శంకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. మహిళలు, బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
19 లీటర్ల మద్యం సీజ్
యాచారం: నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ మధు తెలిపిన ప్రకారం.. పంచాయతీ ఎన్నికల విధుల్లో భాగంగా సోమవారం మాల్–మంతన్‌గౌరెల్లి మధ్య యాచారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భాను తండాకు చెందిన జర్పుల హరికిషన్ మాల్‌లోని రేణుక ఎల్లమ్మ వైన్స్ నుంచి 19 లీటర్ల మద్యాన్ని ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో మద్యం, ఆటో సీజ్ స్వాధీనం చేసుకుని హరికిషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


