ప్రచారంలో అభ్యర్థికి గుండెపోటు
శంకర్‌పల్లి: గ్రామంలో వార్డు మెంబర్ పదవికి నామినేషన్ దాఖలు చేసి ప్రచారం చేస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి శంకర్‌పల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మాసానిగూడ అనుబంధ గ్రామం మంచర్లగూడెంకి చెందిన పల్లె నర్సింలు, లత(42) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డు పదవికి పల్లె లత నామినేషన్ దాఖలు చేశారు. నిత్యం గ్రామంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రచారం చేస్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శేరిగూడలో వివాహిత..
శంకర్‌పల్లి: గుండెపోటుతో ఓ వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన ప్రకారం.. శేరిగూడ గ్రామానికి చెందిన వడ్డె రాజు, లావణ్య(25) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. రాజు పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం లావణ్య ఇంట్లో పనులు చేసుకుంటూ ఊపిరి ఆడడం లేదని చెప్పడంతో హుటాహుటినా శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
ప్రచారంలో అభ్యర్థికి గుండెపోటు


