బీఆర్‌ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సస్పెండ్
యాచారం: స్థానిక జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ, ఆమె భర్త యాదయ్యను బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ ప్రకటించారు. మండలంలోని మంతన్‌గౌరెల్లి గ్రామంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా గులాం సుభానీ పేరును అధిష్టానం ప్రకటించినప్పటికీ జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు జంగమ్మతో పాటు ఆమె భర్త యాదయ్య కాంగ్రెస్ పార్టీ బలపర్చిన శేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వివరించారు.


