గెలుపుపై గురి
గ్రామాల్లో సందడి
షాద్‌నగర్: తొలివిడత ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారనే లెక్క తేలిపోయింది. సర్పంచ్, వార్డు పదువులే లక్ష్యంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసి అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించడంతో ప్రచారంలో తలమునకలవుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. నిబంధనల ప్రకారం 9న సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు గ్రామాల్లోని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులతో కరపత్రాలు ముద్రించి ప్రచార పర్వానికి తెరలేపారు. ఓ వైపు గ్రామ పెద్దలు, నాయకులతో మంతనాలు సాగిస్తూనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ వారి గెలుపునకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం
ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి సర్పంచ్‌గా గోపాల్‌రెడ్డి, కొందుర్గు మండలం పాత ఆగిర్యాల సర్పంచ్‌గా యాదమ్మ, చెర్కుపల్లి సర్పంచ్‌గా యాదయ్య, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌గా మంచాల అనూష, కేశంపేట మండలం దేవునిగుడితండా సర్పంచ్‌గా సుజాత ఏకగ్రీవం అయ్యారు. నందిగామ మండలం కన్హా సర్పంచ్‌గా మధుసూదన్‌తో పాటు వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు తెలిపారు.
చెక్‘పవర్’కోసం ప్యానల్స్
పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్‌లకు కలిపి చెక్ పవర్‌ను అందించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికోసం వార్డు సభ్యులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చాలా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా కొన్ని చ్లోట్లనే ఫలించాయి. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వారు అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులనే బరిలో దించి ప్యానల్‌గా పోటీ చేస్తున్నారు. గెలిచిన పక్షంలో ఉప సర్పంచ్ పదవిని సైతం కై వసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వార్డు సభ్యుల ప్రచార ఖర్చును సైతం సర్పంచ్ అభ్యర్థులే భరిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు సర్పంచ్‌గా సత్తా చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
తొలివిడత ప్రచారం ముమ్మరం
ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న అభ్యర్థులు
ఉపసర్పంచ్ పదవి కోసం వార్డు సభ్యుల ఆరాటం
పల్లెపోరుతో గ్రామాల్లో కోలాహలం
పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పల్లెల్లో హడావుడి చేస్తున్నారు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మద్దతుదారులకు మందు, విందులు ఇవ్వడం.. నయానో భయానో ప్రత్యర్థి వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
గెలుపుపై గురి


