ఎన్నికల నిర్వహణపై ర్యాండమైజేషన్
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమక్షంలో పూర్తి చేశారు. జిల్లాలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా విధులు నిర్వర్తించే 4,458 మంది ప్రిసైడింగ్, ఇతర అధికారులతో కూడిన బృందాలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్టు కలెక్టర్ తెలిపారు. వారికి కేటాయించిన మండల కేంద్రాల్లో రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించినట్టు చెప్పారు. ఎవరైనా విధులకు గైర్జాజరైతే ఎన్నికల నిబంధనలను అనుసరించి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


