విలీనం.. గందరగోళం!
ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
అశాసీ్త్రయమైన నిర్ణయం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురపాలక సంఘాల రికార్డుల అప్పగింతలో గందరగోళం నెలకొంది. సమీప జోన్లకు కాకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత అప్పగించడంపై దుమారం చెలరేగుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు భిన్నంగా కేటాయింపులు ఉండడం అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల నుంచే కాకుండా అధికార పార్టీ నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో అధికార యంత్రాంగం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం గమనార్హం.
అనాలోచిత నిర్ణయాలతో అయోమయం
రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీ ఆయా పురపాలికల రికార్డుల స్వాధీనానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల రికార్డులను చార్మినార్ జోన్ కమిషనర్‌కు అప్పగించడం, మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట రికార్డులను చార్మినార్ జోన్‌కు, ఇదే నియోజకవర్గంలోని మీర్‌పేట్ రికార్డులు సహా తుక్కుగూడ రికార్డులను ఎల్బీనగర్ జోనల్‌కు అప్పగించాలని ఆదేశించడం చర్చకు దారి తీసింది. పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ చెబుతున్నా భవిష్యత్తులో జోన్ల కేటాయింపు ఇలాగే ఉంటే రాజకీయ దుమారం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పురపాలక సంఘాల ప్రజలకు అనువుగా ఉండేలా కేటాయింపు ఉండాల్సి ఉండగా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అప్పగింతలు చేయడం తగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అసంబద్ధంగా రికార్డుల స్వాధీన ప్రక్రియ
భౌగోళిక ప్రాంతానికి భిన్నంగా నిర్ణయం
చర్చనీయాంశంగా జోన్ల కేటాయింపు
ప్రభుత్వ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
స్థానికుల అభ్యంతరాలతో పునరాలోచనలో సర్కార్
జిల్లాలోని 11 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ ఉద్యోగులు నగరంలో ఉంటూ శివారు మున్సిపాలిటీలు, గ్రామాల్లో పని చేస్తున్నారు. కొంగరలోని ఒక్క కలెక్టరేట్‌లోనే 600 మందికిపైగా ఉన్నారు. ఇక ఉపాధ్యాయులు, తహసీల్దార్, ఎంపీడీఓ కేంద్రాలు సహా ఇతర ప్రభుత్వ విభాగాల్లో మరో 2,400 మంది వరకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం వీరికి 12 శాతం హెచ్‌ఆర్‌ఏ మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై జీహెచ్‌ఎంసీలోని ఉద్యోగుల మాదిరే విలీన మున్సిపాలిటీల్లోని ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ 24 శాతానికి పెరిగే అవకాశం ఉంది. మూడువేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు అంచనా.
జిల్లాను సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. శివారు మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయొద్దని ఒకవైపు జిల్లా ప్రజలు ఉద్యమిస్తుంటే దానికి విరుద్ధంగా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం తుగ్లక్ నిర్ణయమే. తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను చార్మినార్ జోన్ పరిధిలోకి చేర్చడం తలతిక్క చర్య. జిల్లా అస్థిత్వాన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
శాసీ్త్రయత లేకుండా అడ్డగోలుగా జోన్ల విభజన చేయడం సరి కాదు. తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను చార్మినార్ జోన్‌లో కలపడం దివాలా కోరుతనానికి నిదర్శనం. తుక్కుగూడను ఎల్బీనగర్ జోన్‌లో కలిపి ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలను చార్మినార్ జోన్‌లో కలపడం ఏ విధంగా సరైందో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా విభజన జరగాలి. అప్పటివరకు ప్రొసీడింగ్‌ను నిలిపేయాలి.
– ఓరుగంటి యాదయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు


