ఇక ‘ఢీ’లిమిటేషన్
కొత్త పురపాలికలతోనే కొత్త బడ్జెట్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీక్యూర్) వరకు ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో ఇక వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతమున్న వార్డులు, జీహెచ్‌ఎంసీలో కలిసిన 27 పురపాలికల్లోని వార్డులతో కలిపి కొత్తగా వార్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం డీలిమిటేషన్ ఖరారుకు ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువరించనున్నారు. నిబంధనల మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల కోసం వారం రోజుల గడువిచ్చి.. వాటిని పరిగణనలోకి తీసుకొన్న అనంతరం దాదాపు పదిరోజుల్లో డీలిమిటేషన్ పూర్తి చేయనున్నారు. డీలిమిటేషన్ పూర్తయితేనే మొత్తం గ్రేటర్ పరిధిలో ఎన్ని సర్కిళ్లు, ఎన్నివార్డులు ఉంటాయో వెల్లడి కానుంది.
పరిపాలన సౌలభ్యం కోసమే..
ప్రస్తుతం 27 పురపాలికలను ఆయా జోన్ల పరిధిలోకి తేవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తుర్కయాంజాల్, బడంగ్‌పేట్ పురపాలికలు చార్మినార్ జోన్‌లో ఉండటంతో, తమకు ఎల్‌బీనగర్ జోన్ దగ్గర, సదుపాయం అంటూ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే పోచారం రికార్డులు ముషీరాబాద్ సర్కిల్, బోడుప్పల్ రికార్డులు అంబర్‌పేట్ సర్కిల్, పీర్జాదిగూడ రికార్డులు గోషామహల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దగ్గరలోని సర్కిళ్లను కాదని దూరప్రాంతాల అధికారులకు బాధ్యతలప్పగించడం అంతుచిక్కడం లేదంటున్నారు.
● ఇవి కేవలం తాత్కాలిక చర్యలేనని, పరిపాలన సౌలభ్యం కోసం చేసుకున్న ఏర్పాట్లని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ విలేకరులకు చెప్పారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాక, వాటిని పరిష్కరిస్తూ వార్డులు ఖరారవుతాయన్నారు. బుధవారం కమిషనర్ నుంచి రికార్డుల స్వాధీనం ప్రొసీడింగ్స్ అందిన తక్షణమే చాలామంది డిప్యూటీ కమిషనర్లు ఆయా పురపాలికల కార్యాలయాలకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి 2 గంటల వరకు ఈ పనులు జరిగాయి. గురువారం చాలా పురపాలికలకు వాటి బోర్డులు తొలగించి జీహెచ్‌ఎంసీ బ్యానర్లు, బోర్డులు ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్లుగా మారిన పురపాలికల కమిషనర్లు శుక్రవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పనుల్లో భాగస్వాములు కావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు.
ఈ నెల చివరి వారంలో డీలిమిటేషన్ పూర్తి కానున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను కొత్తగా కలిసిన పురపాలికలతో కలిపి రూపొందించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ వరకే ఆమోదం పొందాలని భావించినప్పటికీ, అన్నింటికీ కలిపే కొత్త బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమయ్యారు. బడ్జెట్ ముసాయిదాను ఈ నెల 11న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. దాని ఆమోదం అనంతరం పాలకమండలి ముందుంచుతారు.
వార్డుల విభజన కోసం రెండ్రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణకు ప్రకటన
విలీన మున్సిపాలిటీలు సహా టీసీయూఆర్ వరకు కొత్త బడ్జెట్
ప్రస్తుత జోన్ల పరిధి తాత్కాలికమే.. ఫైనల్ కాదు


