సిత్రమైన పొత్తులు | - | Sakshi
Sakshi News home page

సిత్రమైన పొత్తులు

Dec 5 2025 1:14 PM | Updated on Dec 5 2025 1:14 PM

సిత్రమైన పొత్తులు

సిత్రమైన పొత్తులు

పంచాయతీల్లో సర్పంచ్‌ పీఠం కోసం ఏకమవుతున్న ప్రధాన పార్టీలు

ఉపర్పంచ్‌ పదవి కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి మద్దతిస్తున్న బీజేపీ

కడ్తాల మండలం సాలార్‌పూర్‌ అభ్యర్థికి మూడు పార్టీల మద్దతు

ఆమనగల్లు: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. సర్పంచ్‌ పీఠం దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒక్కటవగా.. మరో చోట అధికార కాంగ్రెస్‌ సైతం స్నేహ హస్తం అందించడం విశేషం. నోటిఫికేషన్‌కు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పంచాయతీ పోరులో ఒంటరిగా బరిలో ఉంటామని ప్రకటించినా.. ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల మండలాల్లలో కమలం నేతలు కారు పార్టీతో పొత్తు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల పోటీకి దిగారు.

ఒక్కో అభ్యర్థికి రెండు పార్టీల మద్దతు

● మంగళపల్లిలో ఎస్టీ మహిళకు కేటాయించారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా మౌనిక బరిలో దిగారు. మరో ఇద్దరు సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేశారు.

● శెట్టిపల్లి సర్పంచ్‌ పదవికి జంగమ్మ బీఆర్‌ఎస్‌, బీజేపీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలిచింది.

● మేడిగడ్డతండాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా హేమిబాయ్‌ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిగా రాజేశ్వరి పోటీ పడుతున్నారు.

● కడ్తాల ఎస్సీ రిజర్వ్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థిగా బావండ్లపల్లి ఆనంద్‌కు బీజేపీ నేతలు మద్దతు పలికారు. మద్దతుకు ప్రతిఫలంగా బీజేపీ పార్టీకి ఉపసర్పంచ్‌ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది.

● కడ్తాల మండలం చరికొండలో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి మహేందర్‌కు బీజేపీ మద్దతు తెలుపుతూ ఉపసర్పంచ్‌ పదవి తమకు ఇవ్వాలని షరతు పెట్టినట్లు సమాచారం.

● మాడ్గుల మండలం కొల్కులపల్లిలో మాజీ సర్పంచ్‌ అనురాధకు కాంగ్రెస్‌ బలపరచగా బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ధర్మారెడ్డిని పోటీలో ఉంచారు.

● కడ్తాల మండలం సలార్‌పూర్‌ పంచాయతీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు సంయుక్తంగా పద్మ నామినేషన్‌ వేయగా.. బీఆర్‌ఎస్‌లోని మరోవర్గం నుంచి సర్పంచ్‌ పదవికి ప్రియ నామినేషన్‌ దాఖలు చేశారు. ఉమ్మడి అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ జెండాలతో నేతలు కనిపించారు. పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఏ ఏ పార్టీలు కలుస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement