పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతగిరి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. గురువారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీఓలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషాతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, అడిషనల్ ఎస్పీ రాము నాయక్, వ్యయ పరిశీలకులు రమేష్ కుమార్, ఆర్‌డీఓ వాసుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు పోలింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 594 గ్రామా పంచాయతీలకు 98 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించనున్నట్లు తెలిపారు. వీరు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఎల్‌డీఎం యాదగిరి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మాధవ రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
27 పంచాయతీలకు 75 మంది పోటీ
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మండలంలో 33 పంచాయతీలకు 6 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 27 జీపీల్లో 75 మంది సర్పంచు అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపీడీఓ విశ్వప్రసాద్ తెలిపారు. 290 వార్డులకు 96 ఏకగ్రీవం కాగా.. 194 వార్డులకు 426 మంది బరిలో ఉన్నారు.
పెద్దేముల్లో 100 మంది
పెద్దేముల్ మండలంలో 38 గ్రామాలకు 5 ఏకగ్రీవమయ్యాయి. 33 పంచాయతీలకు 100 మంది సర్పంచు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 308 వార్డుల్లో 74 ఏకగ్రీవంకాగా.. 234కు 529 బరిలో ఉన్నారని ఎంపీడీఓ రతన్‌సింగ్ తెలిపారు.