గతం.. మానని గాయం
బాధిత కుటుంబాలను వెంటాడుతున్న విషాదం
నాలుగేళ్ల క్రితం నా కొడుకు తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీ కొని మృత్యువాతపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. నాకున్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అదే బాధతో కొన్నాళ్లకు భర్త నారాయణ సైతం కన్నుమూశాడు. ఏ దిక్కు లేక ఒంటరిని అయ్యా. ఈ రాకాసి రోడ్డు నా కొడుకుతో పాటు ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. నిత్యం రక్తం ఏరులై పారుతూనే ఉంది. పాలకుల్లో మాత్రం చలనం లేదు. రోడ్డు విస్తరణ జరగడం లేదు. నాకొచ్చిన కష్టం మరే తల్లికి రాకూడదు.
– గారెల కమలమ్మ, ఆలూరు, చేవెళ్ల
ఆలూరు గేటు వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న మాపై ఏడాది క్రితం లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. అదృష్టం కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డా. నాతో పాటు కూరగాయలు అమ్ముకుకునేందుకు వచ్చిన మా బావ నా కళ్లముందే కన్నుమూశాడు. దూసుకొచ్చిన లారీని చెట్టు అడ్డుకోవటంతో నేను గాయాలతో బయటపడ్డా. కాలుకు తీవ్రమైంది. ఐదు నెలలు ఇంట్లోనే ఉన్నా. గాయం నయం కావటంతో ఇప్పడిప్పుడే పొలం పనులకు వెళ్తున్నా. తాజా బస్సు ప్రమాదంతో పాత జ్ఞాపకం మళ్లీ గుర్తొచ్చింది.
– నక్కలపల్లి రేణుక, ఆలూరు, చేవెళ్ల
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ చేవెళ్ల, నవాబుపేట: బీజాపూర్ జాతీయ రహదారి(163) ఉమ్మడి జిల్లా ప్రజల పాలిట మరణ శాసనంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలు, వందలాది కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇరుకై న మలుపులతో కూడిన ఈ రోడ్డు విస్తరించకపోవడంతో కేవలం ఆరేళ్లలోనే 273 మంది మృతి చెందారు. అనేక మంది కాళ్లు, చేతులు కోల్పోయి జీవశ్ఛవంలా మారారు. ఆ పీడ ఘటనలు బాధిత కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు.. పతులను కోల్పోయిన సతులు.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. కాళ్లు, చేతులు, ఇతర అవయవాలను కోల్పోయిన వారు సైతం ఇప్పటికీ ఆ పాత గాయాన్ని తలచుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. బాధితుల గోడు మాత్రం ఇక్కడి పాలకులకు పట్టడం లేదు. ప్రతీ ఎన్నికలో ఈ రోడ్డు విస్తరణే ప్రధాన ఎజెండాగా తెరపైకి వస్తుంది. తీరా ఎన్నికల తర్వాత మాయమవుతోంది. ఏదైనా ఘటన జరిగిన సమయంలోనే పరామర్శలు, సంతాపాల పేరుతో నేతలు హడావుడి చేయడం ఆ తర్వాత విస్మరిస్తుండటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో మంది మృత్యువాతకు రోడ్డు ప్రత్యక్ష కారణమైతే.. పరోక్షంగా ఇక్కడి పాలకులు కారణమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు
పతులను కోల్పొయిన సతులు.. అనాథలైన చిన్నారులు
కాళ్లు, చేతులు కోల్పోయి దుర్భరంగా మారిన బతుకులు
పాలకులకు ఎన్నికల పావుగా మృత్యుమార్గం
గతం.. మానని గాయం
గతం.. మానని గాయం


