రక్తం ఏరులై పారుతున్నా పట్టించుకోరా?
మొయినాబాద్: రోడ్లపై రక్తం ఏరులై పారుతున్నా పట్టించుకోరా.. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి అంటూ రోడ్లు, రహదారుల ఉద్యమ వేదిక కన్వీనర్ షాపుర శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, జాతీయ రహదారి, గ్రామాల రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బుధవారం మొయినాబాద్‌లో రోడ్లు, రహదారుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ప్రధాన చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి ముఖ్యమంత్రి, రోడ్లు, రవాణాశాఖ మంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారితో పాటు గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారి నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. జాతీయ రహదారితో పాటు అన్ని గ్రామాల రోడ్లు వెంటనే బాగుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రోడ్లు, రహదారుల ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, నాయకులు అంజయ్యగౌడ్, ప్రభాకర్, రాజమల్లేశ్, మహేశ్, పాండు, మహేందర్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
మీర్జాగూడ రోడ్డు ప్రమాదానికి
సీఎం, మంత్రులు బాధ్యత వహించాలి
రోడ్లు, రహదారుల ఉద్యమ వేదిక కన్వీనర్ శ్రీకాంత్


