బధిరుల పాఠశాల స్థలాన్ని కాపాడండి
అడహక్ కమిటీ సభ్యుడు పి.ఉమర్‌ఖాన్
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 230–233 వరకు ఉన్న ఏపీ ఆదర్శ బధిరుల పాఠశాలకు చెందిన భూమిపై అక్రమార్కులు కన్నుపడిందని.. కోట్లాది రూపాయలు విలువచేసే భూములు కాపాడి బధిరులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బధిరుల పాఠశాల సంస్థ అడహక్ కమిటీ సభ్యుడు పి.ఉమర్‌ఖాన్ కోరారు. బుధవారం పాఠశాల ఆవరణలో సంస్థ మాజీ ప్రఽతినిధులు, సభ్యులు, పాఠశాల సిబ్బంది విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఆదర్శ బధిరుల సొసైటీకి చెందిన సుమారు 16.08 ఎకరాల భూమిలో సొసైటీతో సంబంధం, హక్కులు లేని వ్యక్తులు బైలాకు విరుద్ధంగా నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలను సృష్టించి 9.15 ఎకరాల భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి విక్రయించి సొమ్ముచేసుకున్నారన్నారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైగా ఉంటుందన్నారు. తాము విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి రిజిస్టర్ డాక్యుమెంట్లు రద్దు చేయించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. గతంలో సొసైటీలో పనిచేసిన కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి మరలా ఈ భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తూ, అడ్డుకునేందుకు వెళ్తున్న తమపై, బధిర విద్యార్థులపై దాడులకు పాల్పడేందుకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం, స్థానికులు స్పందించి బధిరుల పాఠశాలకు చెందిన భూమిని అన్యాక్రాంతం కాకుండా తమకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ అసోసియేట్ సభ్యుడు వెంకట్‌రెడ్డి, సొసైటీ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగలత, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


