సొంతింటి కల సాకారం
మహేశ్వరం: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామంలో ఫేజ్–1, ఫేజ్–2లో నిర్మించిన 2,848 డబుల్ బెడ్రూం ఇళ్లను అలాట్‌మెంట్ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోర్టు కేసుల కారణంగా పంపిణీలో జాప్యం అయిందని.. కేసు పరిష్కారానికి ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవడంతో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశామన్నారు. ఇక్కడ కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. అనంతరం లబ్ధిదారులు ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయక్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత
మంఖాల్ ఫేజ్–1, ఫేజ్–2లో నిర్మించిన 2,848 డబుల్ ఇళ్లు పంపిణీ


