మహేశ్వరంలో భీకర వాన
అలుగు పారిన కోటిరెడ్డి కుంట
● వరద ప్రవాహంలో చిక్కుకున్న కేజీబీవీ విద్యార్థులు
మహేశ్వరం: కుండపోత వర్షం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరద ఉధృతిలో కేజీబీవీ విద్యార్థులు చిక్కుకొని తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో చెరువులు, కుంటలకు భారీగా వరదనీరు చేరుకుంది. మండల పరిధిలోని కోత్వాల్ చెర్వుతండా, కావలోనిబాయి తండా, మహేశ్వరం, రామచంద్రగూడ, మన్సాన్‌పల్లి, గంగారం, పెండ్యాల, తుమ్మలూరు, సిరిగిరిపురం పలు గ్రామాల్లో వరద నీరు ఏరులై పారింది. రామచంద్రగూడేనికి ఆనుకొని ఉన్న కోటిరెడ్డి కుంటలోకి భారీగా వరదనీరు చేరడంతో కుంట నిండి అలుగు పారింది. ప్రవాహం మెగుళ్ల చెరువులోకి అక్కడి నుంచి అమీర్‌పేట్ తాళ్ల చెరువులోకి వెళ్లింది.
రాజరాజేశ్వర ఆలయంలోకి నీరు
మండల కేంద్రంలో కొలువైన శివగంగ రాజరాజేశ్వర ఆలయంలోకి భారీగా వరద నీరు చేరుకుంది. రాజరాజేశ్వరీ అమ్మవారి గర్భ గుడిలోకి వర్షం నీరు చేరింది. నీటిని మోటార్ల ద్వారా తీసేందుకు ఆలయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రాంగణంలోకి సైతం వరద నీరు చేరింది. కేసీతండా సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుకుంది. హాస్టల్ పరిసరాలు, వంటగదిని వరద ముంచెత్తింది.
నీట మునిగిన కస్తూర్బా గాంధీ హాస్టల్ భవనం
ఉధృతంగా ప్రవహిస్తున్న కోటిరెడ్డి కుంట అలుగు
మహేశ్వరంలో భీకర వాన
మహేశ్వరంలో భీకర వాన


