నేటి నుంచి మైసిగండి జాతర
కడ్తాల్: మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో కొలువైన, భక్తుల ఇలవేల్పు.. కొలిచిన వారికి కొంగుబంగారం.. శ్రీ మాత మైసిగండి మైసమ్మ తల్లి వార్షిక జాతర ఉత్సవాలు నేటి నుంచి 10వ తేదీ వరకు ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే ఈ జాతరకు జిల్లా వాసులతో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ, హైదరాబాద్, మెదర్ తదితర తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న అమ్మవారి ఆలయానికి నిత్యం భక్తుల తాడికి ఉంటుంది. ఆది, మంగళ, గురువారాల్లో మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. జాతర ఉత్సవాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలకరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ట్రస్టీ శిరోలి, ఈఓ స్నేహలత తెలిపారు.
రవాణా సదుపాయం
హైదరాబాద్ ఇమ్లీబన్ బస్టాండ్ నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. నల్గొండ ఎక్స్ రోడ్స్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్, చంద్రయాన్‌గుట్ట నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట్ నుంచి బస్సులు ఉన్నాయి.
ఆరు రోజులపాటు మైసమ్మ తల్లి ఉత్సవాలు
ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు
జాతర కార్యక్రమ వివరాలు
వారం పూజలు
బుధ క్షీరాభిషేకం, కుంభ హారతి, విశేష అలంకరణ
గురు సహస్ర చండీయాగం, విశేష పూజలు,
రాత్రి పుష్పరథోత్సవం, చిన్న తేరు ఊరేగింపు
శుక్ర సహస్ర చండీయాగం, విశేష పూజలు, పెద్ద రథోత్సవం
శని సహస్ర చండీయాగం, విశేష పూజలు, పూర్ణాహుతి
ఆది బోనాలు, బండ్లు తిప్పుట
సోమ కూరగాయలతో అలంకరణ, అన్నదానం
నేటి నుంచి మైసిగండి జాతర


