పత్రాలు లేని వాహనాలు సీజ్
రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్‌గౌతం
మొయినాబాద్: ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉండాలని.. లేదంటే సీజ్ చేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతం అన్నారు. మున్సిపల్ కేంద్రంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ప్రతీ వాహనం పత్రాలను పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో లగేజీ, ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్న వస్తువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. మధ్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి కుటుంబాలు నష్టపోతాయన్నారు. జాతీయ రహదారి కావడంతో మాదక ద్రవ్యాల రవాణా జరిగే అవకాశం ఉందని.. వాటితోపాటు ప్రమాదాల నివారణకోసం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. తనిఖీల్లో మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటన్న, నయీమొద్దీన్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పిడుగుపాటుకు లేగదూడ మృతి
కేశంపేట: పిడుగుపాటుతో లేగదూడ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని కాకునూరులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రుమాండ్ల కుమారస్వామికి చెందిన లేగదూడ మేతమేస్తున్న క్రమంలో హఠాత్తుగా పిడుగు పడింది. దీంతో లేగదూడ మృత్యువాత పడింది. లేగదూడ విలువ సుమారు రూ.20 వేలు ఉంటుంది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
పత్రాలు లేని వాహనాలు సీజ్


