సర్కారు దవాఖానకు వెళ్లొస్తామని..
యాలాల: మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన కుడుగుంట బందెప్ప (45), కుడుగుంట లక్ష్మి (43) దంపతులు. అడ్డాకూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. ఏడాదిగా లక్ష్మి కడుపులో పెరుగుతున్న కణితి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే స్థోమత లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చూపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొరుగింటివారి వద్ద తమ ఇద్దరు పిల్లలు శిరీష, భవానీలను వదిలి సాయంత్రం వరకు తిరిగి వస్తామని చెప్పి వెళ్లారు. తెల్లవారుజామున ప్రైవేటు ఆటోలో తాండూరుకు వచ్చారు. అక్కడ బస్సు ఎక్కిన దంపతులు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న హాజీపూర్ గ్రామస్తులు వారి పిల్లలను వెంటబెట్టుకొని చేవెళ్లకు వెళ్లారు. నిర్జీవంగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన పిల్లలను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. ఉదయం నుంచి వారి ఇంటి వద్ద గుమిగూడారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
