రెండు బస్సులు ఢీ.. ప్రయాణికులు సురక్షితం
డివైడర్లను గుర్తించకపోవడంతోనే ప్రమాదం
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం శేరిగూడ సమీపంలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్– నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఇందు కళాశాల వద్ద ఆదివారం స్పీడ్ బ్రెకర్లను ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. దీంతో వీటిని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొదిలి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కి పడి లేచారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రెండు బస్సుల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.
వరుస ప్రమాదాలు
కళాశాల వద్ద వారంలో రెండుసార్లు ఒకే స్థానంలో స్పీడ్ బ్రెకర్స్‌ను ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేశారు. అక్కడ లైట్లు లేకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఆ స్పీడ్ బ్రెకర్లను అధికారులు తొలగించారు. తాజాగా ఆదివారం రాత్రి చిన్న స్పీడ్ బ్రెకర్లు దగ్గరదగ్గర నాలుగు వేశారు. సూచిక, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తాజా ఘటన చోటు చేసుకుంది.


