కర్మాగారంలో కార్మికుడి మృతి
తాండూరు రూరల్: పనిచేస్తున్న సంస్థలో ఓ కార్మికుడి గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ సంఘటన మండల పరిధి మల్కాపూర్‌లోని ఐసీఎల్ సిమెంట్ కర్మాగారంలో బుధవారం చోటుచేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కలుబుర్గి జిల్లా షాహబాద్ తాలుకా బాలునాయక్ తండాకు చెందిన రాథోడ్ జైరాం(55), 18 ఏళ్లుగా సిమెంట్ కంపెనీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తూ.. అందులోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తరువాత రాథోడ్ మూత్ర విసర్జనకు వెళ్లి, అక్కడే స్పృహతప్పి కింద పడిపోయాడు. గమనించిన షిఫ్ట్ ఇన్‌చార్జి, తోటి కార్మికులు జైరాంను పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి వైద్యులు పరీక్షించి, అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి కుమారుడు ఆకాష్ ఫిర్యాదు మేరకు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కాగా.. కార్మికుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.


