
ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం
మహేశ్వరం: ప్రమాదవశాత్తు క్వారీ నీటి గుంతలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఎన్డీతండా జేజే కాలేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్ ఇంద్రారెడ్డినగర్ కాలనీకి చెందిన షాబాద్ అంకిత్(15) ఎన్డీతండా పక్కన ఉన్న జేజే కాలేజ్‌లో అద్దెకు నిర్వహిస్తున్న రాజేంద్రనగర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం బ్రేక్ సమయంలో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి సమీపంలోని క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్న క్రమంలో ఊపిరి ఆడక అంకిత్ నీట మునిగాడు. భయపడిన ఇద్దరు స్నేహితులు హాస్టల్‌కు పరుగు తీసి, విషయం చెప్పారు. సిబ్బంది, పోలీసులు క్వారీ వద్దకు చేరుకొని వెతికినా ఫలితం కనిపించలేదు. సోమవారం ఉదయాన్నే మృతదేహాన్ని బయటకు తీశారు. హాస్టల్ వార్డెన్, వాచ్‌మన్ కారణంగానే తమ కుమారుడు మరణించాడని తల్లి దండ్రులు, ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్వారీ గుంతలో మునిగి మృత్యువాత