
చిన్నారిని చిదిమేసిన కారు
మణికొండ: వెలుగులు నింపుతుందనుకున్న దీపావళి పండగ వారి కుటుంబంలో కారు చీకట్లను నింపింది. మరికొద్ది సేపట్లో ఇంటికి వెల్లి టపాకాయలు కాల్చి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ విధి వక్రించింది. బైక్‌పై సక్రమంగా వెలుతున్న వారిని వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టి వారి ఇంటి దీపాన్ని ఆర్పేసింది. పండగ సంతోషాలకు బదులు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలకాపూర్ టౌన్‌షిప్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. నార్సింగి పోలీస్‌స్టేషన్, అలకాపూర్ సెక్టార్ ఎస్‌ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..నార్సింగిలోని వివేకానందనగర్ కాలనీలో భార్య అనూష, కూతురు, కుమారుడితో కలిసి నవీన్‌కుమార్ నివసిస్తున్నాడు. ఓ నిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అతను సోమవారం దీపావళి పండగ ఉండటంతో కుటుంబానికి అవసరమైన వస్తువులతో పాటు టపాకాయలను కొనుగోలు చేసేందుకు నలుగురు బైక్‌పై ఖాజాగూడ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో...
షాపింగ్ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో వీరు అలకాపూర్ టౌన్‌షిప్‌లోకి రాగానే టాటా నెక్సాన్ (టీఎస్ 09 ఏఈ /టీఆర్ 2860) ఎలక్ట్రిక్ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. దాంతో బైక్‌పై ముందు కూర్చున్న నవీన్‌కుమార్ కుమారుడు కుషాన్ జోయల్ (2) ఎగిరి కిందపడ్డాడు. బైక్ అలాగే ముందుకు వెల్లడంతో కిందపడిన బాలుడి పైనుంచి కారు వెళ్లింది. దాంతో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా.. నానక్‌రాంగూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. కారు యజమాని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కొత్తగా కారు కొనుగోలు చేయటం, సరిగా డ్రైవింగ్ రాకుండా నడపటంతోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించామని, ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ను వేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం
ఎగిరిపడిన బాలుడు..తలపై నుంచి వెళ్లిన కారు
ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

చిన్నారిని చిదిమేసిన కారు