
పేలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
చేవెళ్ల: మండలంలోని ఈర్లపల్లి సమీపంలో ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అకస్మాత్తుగా పేలిపోయింది. సోమవారం దీపావళి రోజున వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌పార్మర్ ఒక్కసారిగా పేలడంతో శబ్దానికి చుట్టు పక్కల ఉన్న రైతులు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో కాసేపటి దాకా అర్థం కాలేదు. పేలిన చోటు నుంచి మంటలు వచ్చి భారీగా పొగ వెలువడింది. ఈ విషయమై విద్యుత్ ఏఈ రాజేంద్రకుమార్‌ను వివరణ కోరగా ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ అయిపోయి షార్ట్‌సర్క్యూట్‌తో పేలినట్లుగా చెప్పారు. బుధవారం వరకు మరొకటి ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కారిస్తామని తెలిపారు.
తండ్రీకొడుకులకు గాయాలు
బొలెరే వాహనం యాక్టీవాను ఢీకొట్టడంతో ప్రమాదం
కొందుర్గు: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కొందుర్గులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ప్రజాప్రత్ ప్రభురామ్ కుటుంబ సభ్యులు వ్యా పా రం నిమిత్తం ఇరవై ఏళ్ల క్రితం కొందుర్గు కు వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. సోమవారం రాత్రి 10.50 గంటలకు ప్రభురామ్ తన కుమా రుడు హిమాన్షు(12)తో కలిసి యాక్టీవా వాహనంపై గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో ఢీకొట్టింది. ఈప్రమాదంలో హిమాన్షు తలకు బలమైన గాయాలు కావడంతో నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి, ప్రభురామ్‌ను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్రనాయక్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
ఉప్పల్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హనుమానాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉపేంద్ర చారి, స్వప్న(27) దంపతులు రామంతాపూర్ వెంకట రెడ్డి నగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా వీరి మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన స్వప్న సోమవారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. ఉపేందర్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.