
సంపులో పడి.. చిన్నారి మృతి
షాబాద్: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడంపహాడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల మల్లేశ్, స్వాతి దంపతుల కూతురు రక్షిత(18నెలలు) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందింది. చిన్నారిని నానమ్మ వద్ద వదిలేసి, తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి, వీరి ఇంటి పక్కనే కొత్త గృహం నిర్మిస్తున్న సుగుణమ్మకు చెందిన పైకప్పు లేని సంపులో పడి చనిపోయింది. పాప చేతిలోని పెన్ను సంపులో పైకి తేలడంతో స్థానికుడు సత్తయ్య లోపలికి దిగి చిన్నారిని బయటకు తీశాడు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బోరున విలపిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో గుండెలు పగిలేలా రోదించారు. మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
మీర్‌పేట: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లెలగూడ ప్రగతినగర్‌కు చెందిన ఆలంపల్లి విజయ్‌కుమార్ (43) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. సోమవారం ఉదయం విజయ్‌కుమార్ మెడ భాగంలో గాయాలై బాత్‌రూమ్ వద్ద పడి వుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విజయ్‌కుమార్ తల్లి సత్తెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ తెలిపారు.
వివాహిత అదృశ్యం
కొందుర్గు: ఓ మహిళ అదృశ్యమైన సంఘటనపై కొందుర్గు పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గుకు చెందిన బంటు సరిత అలియాస్ లక్ష్మికి (35) వికారాబాద్ జిల్లా ధారూరుకు చెందిన బంటు ఆనంద్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం వీరు కొందుర్గుకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అయితే సరిత ఈనెల 10న కూరగాయలు తీసుకొస్తానని ఇంటి నుంచి బయలుదేరి, సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో సరితి తల్లి భారతమ్మ ఫిర్యాదు మే రకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవీంద్రనాయక్ తెలిపారు.
మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీయగా అనారోగ్య సమస్యతో మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్‌ఐ సోమయ్య కథనం ప్రకారం.. కుల్‌దీప్‌సింగ్(82) అనే మతిస్థిమితం లేని వ్యక్తి సంతోష్‌నగర్‌లో రోడ్ల వెంట తిరుగుతుండగా స్థానికులు గమనించి మాతృదేవోభవ అనాథాశ్రమానికి సమాచారం అందించగా వృద్ధుడిని చేరదీశారు. అనారోగ్యంతో ఫిట్స్‌కు గురైన అతన్ని ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించి, మందులు ఇప్పించారు. ఈనెల 19న కుల్‌దీప్‌సింగ్ మరణించాడు. దీంతో ఆశ్రమం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
షాద్‌నగర్ రూరల్: ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. షాబాద్ మండలం కక్కులూరు గ్రామానికి చెందిన ప్రసాద్‌రావు(64) కొంతకాలంగా అనారోగ్యం, మతిస్థిమితం సమస్యతో బాధపడుతూ, తిరుగుతున్నాడు. ఈక్రమంలో పాండిచ్చేరి వెళ్లే రైలు ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ నీరజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్టులకు ప్రతిష్టాత్మక అవార్డులు
ఉప్పల్: జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ చీఫ్ సైంటిస్టులు ప్రతిష్టాత్మకమైన తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్– 2024 అవార్డులకు ఎంపికై నట్లు సంస్థ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా.లబానిరేతో పాటు చీఫ్ సైంటిస్ట్ హెచ్‌వీఎస్ సత్యనారాయణ ఈ అవార్డులు అందుకోనున్నారు. సాలీడ్ ఎర్త్, జియోథర్మల్ ఎర్త్ సైన్స్‌పై డా.లబానిరే అందించిన విశిష్ట సేవలకు ఈ అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు. జియోఫిజికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, సిస్మాలజీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డును అందుకోనున్నారు.

సంపులో పడి.. చిన్నారి మృతి

సంపులో పడి.. చిన్నారి మృతి

సంపులో పడి.. చిన్నారి మృతి