
ఆచితూచి!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భూ సేకరణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా/యాచారం: ఫ్యూచర్‌సిటీ సహా దాని చుట్టూ కొత్తగా పుట్టుకొచ్చే ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం చేపట్టిన భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. బలవంతపు సేకరణతో స్థానికంగా శాంతిభద్రతల సమస్యతో పాటు కోర్టుల్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తే ఆస్కారం ఉండడంతో రైతులను మెప్పించి, ఒప్పించడమే ఉత్తమమని నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం ఆయా భూములకు సంబంధించి ప్రభుత్వ మార్కెట్ విలువకు మూడు రెట్లు అదనంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. రైతులు, భూ యజమానులు నష్టపోకుండా ఉండేందుకు ప్రాంతాన్ని, భూ స్వభావాన్ని బట్టి ఒక్కో రెవెన్యూ పరిధిలో ఒక్కో ప్యాకేజీ నిర్ణయించింది. కందుకూరు, యాచారం, మహేశ్వరం మండలాల్లోని రైతులతో రెవెన్యూ అధికారులు వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూమిని సేకరించగా తాజాగా ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం చేపట్టే భూ సేకరణలో తలమునకలయ్యారు. ఇటీవల కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలోనూ సమావేశమయ్యారు. ఒక్కోరోజు ఒక్కో గ్రామ రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఎకరానికి రూ.2 కోట్లు ఇవ్వాల్సిందిగా రైతులు పట్టుబడుతుండగా, రూ.55 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వరుస నోటిఫికేషన్లు..
భవిష్యనగరం చుట్టూ ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం భారీగా ప్రభుత్వం భూములను సేకరిస్తోంది. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గత డిసెంబర్‌లో కందుకూరు మండలం తిమ్మాపూర్ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో ఇండస్ట్రియల్, ఐటీ పార్కుల కోసం 198.21 ఎకరాలు అవసరమని భావించి, ఆ మేరకు 2025 ఫిబ్రవరి మొదటి వారంలో 195.05 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. కందుకూరు మండలం తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9లోని 439 మంది రైతుల నుంచి 366.04 ఎకరాలు సహా మహేశ్వరం మండలం కొంగరకుర్దు సర్వే నంబర్ 289లోని 94 మంది రైతుల నుంచి 277.06 ఎకరాల భూ సేకరణకు మార్చి 13న నోటిఫికేషన్ జారీ చేసింది. యాచారం మండలంలో ఇండస్ట్రి యల్ పార్కు కోసం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు కోసం ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 13 నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు 41.05 కిలోమీటర్లు.. 330 ఫీట్ల రోడ్డు నిర్మించనున్నట్లు ప్రకటించి ఆ మేరకు ఇటీవల 4,725 మంది రైతుల నుంచి 1,004.22 ఎకరాలు సేకరించింది. ఇప్పటికే ఆయా పనులకు టెండర్లు పిలిచి, శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది.
ఎకరానికి రూ.55 లక్షలు చెల్లింపు
కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో ఎకరం భూమి విలువ ప్రభుత్వం నిర్ణయించిన వాల్యూ ప్రకారం రూ.12,37,500 ఉంది. ప్రభుత్వ మార్కెట్ వాల్యూకి..ప్రైవేటులో ఉన్న ధరలకు భారీ వ్యత్యాసం ఉండడంతో తమ భూములను ఇచ్చేందుకు రైతులు ఇష్టపడటం లేదు. ప్రస్తుత మార్కెట్ విలువకు మూడు రెట్లు అదనంగా పరిహారం చెల్లించి ముందుకు వెళ్లేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎకరానికి మూడు రెట్ల చొప్పున లెక్కిస్తే.. రూ.37,12,500 చెల్లించాల్సి ఉంది. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఎకరానికి రూ.55 లక్షలు ఆఫర్ చేస్తోంది. కొంత మంది రైతులు తమ భూములను ఇచ్చేందుకు సిద్ధమైతే మరికొంత మంది ఇందుకు భిన్నంగా ఎకరానికి రూ.2 కోట్లు సహా 120 గజాల ఇంటి స్థలం ఇప్పించాలని పట్టుబడుతున్నారు.
వివిధ దశల్లో అభివృద్ధి పనులు
ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 13,973 ఎకరాలు సహా మొత్తం 30 వేల ఎకరాల్లో భారత్ భవిష్య నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏడు మండలాలు.. 56 గ్రామాలు...765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మార్చి 12న ఫ్యూచర్‌సిటీ డెవలెప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనం సహా ఎఫ్‌సీడీఏ భవనాలు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఆయా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్ భవనాన్ని ప్రారంభించి.. ఫ్యూచర్‌సిటీ నుంచే పరిపాలన కొనసాగించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఒకవైపు, రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేస్తూనే మరోవైపు పారిశ్రామిక వాడలు, ఐటీ కంపెనీల కోసం భూసేకరణకు సిద్ధమైంది.
●
ఎకరాకు రూ.55 లక్షల పరిహారానికి ప్రభుత్వం సిద్ధం
రూ.రెండు కోట్లు ఇవ్వాలంటున్న బాధిత రైతులు
మెప్పించి, ఒప్పించే దిశగా సర్కార్ చర్యలు
రెవెన్యూ అధికారులు, రైతుల మధ్య చర్చలు

ఆచితూచి!

ఆచితూచి!

ఆచితూచి!