
మీటర్ ప్లీజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. డిమాండ్ మేర తయారీ సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి. ఫలితంగా నూతన ఇంటి నిర్మాణం చేయాలని భావించి, విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నెలల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదు. ఒక్కో సర్కిల్ పరిధిలో 400–500 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే కొన్ని తెప్పించి సరఫరా చేసినప్పటికీ ఇప్పటికీ ఆ కొరత ఏఈలను, ఏడీఈలను, వినియోగదారులను వేధిస్తూనే ఉంది.
ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు
గ్రేటర్‌లో ప్రస్తుతం 63 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 53 లక్షల గృహ, ఎనిమిది లక్షల వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక, మిగిలిన వాటిలో వీధిలైట్లు, జలమండలి, వ్యవసాయ మోటార్లకు సంబంధించిన కనెక్షన్లు ఉంటాయి. వీటికి తోడు అదనంగా ప్రతి నెలా 35 వేలు వచ్చి చేరుతుంటాయి. ప్రతి యూనిట్‌ను పక్కాగా లెక్కించేందుకు ఇప్పటి వరకు ఉన్న సాధారణ ఎలక్ట్రికల్ మీటర్ల స్థానంలో కొత్తగా ఐఆర్‌పోర్టల్ మీటర్లను ఏర్పాటు చేస్తోంది. హెచ్‌పీసీఎల్ సహా ఇతర కంపెనీల నుంచి పెద్ద సంఖ్యలో మీటర్లను కొనుగోలు చేస్తుంది. డిమాండ్ మేర ఆయా సంస్థలు తయారు చేయలేకపోతున్నాయి. ఫలితంగా కొత్త దరఖాస్తుదారులకు సకాలంలో అందించలేని పరిస్థితి. ఏఈ, డీఈ, ఇతర ఉన్న తాధికారులు సిఫార్సు చేస్తే కానీ కొత్త వాళ్లకు వెంటనే మీటర్ జారీ చేయలేని దుస్థితి నెలకొంది.
తరచూ సాంకేతిక సమస్యలు
మీటర్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నాసిరకానికి తోడు.. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా కొన్ని, లూజ్ కాంటాక్ట్‌ల కారణంగా మరికొన్ని, ఓవర్ లోడు కారణంగా ఇంకొన్ని మీటర్లు కాలిపోతుంటాయి. ఈ తరహా ఫిర్యాదులు రోజుకు సగటున 150–200 వరకు ఉన్నట్లు అంచనా. వీటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. మీటర్ల కొరతతో ఈ సమస్య ఇటు డిస్కంను.. అటు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. దసరా, దీపావళి నేపథ్యంలో గృహ ప్రవేశాలు, వాణిజ్య సంస్థల్లో పూజలు చేయాలని భావించే సింగ్‌ల్‌ఫేజ్, సిటీ మీటర్ల విద్యుత్ కనెక్షన్లు లేక ఆయా కాార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.
డిస్కంలో వేధిస్తున్న కొరత
డీడీ తీసినా సకాలంలో అందని వైనం
ఒక్కో సర్కిల్‌లో 400–500 దరఖాస్తులు పెండింగ్
కొత్త కనెక్షన్లకే కాదు రీ ప్లేస్‌కూ తప్పని తిప్పలు
వినియోగదారుల ప్రదక్షిణలు