
సిరుల పత్తి
యాచారం: పత్తి పంట ఈసారి రైతుకు బంగారంగా మారింది. ఎన్నడూ లేని విధంగా సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110 నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. అత్యధికంగా మాడ్గుల, యాచారం, షాద్‌నగర్, తలకొండపల్లి, మంచాల, ఆమనగల్లు, నందిగామ, కందుకూరు, కొత్తూరు మండలాల్లో ఎక్కువ మంది రైతులు పత్తి వేశారు. వర్షాలు కొంత ఆలస్యమైనా తెల్లబంగారం సాగుకే జైకొట్టారు. ఎకరా విస్తీర్ణంలో 5 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ.25 వేల వరకు పెట్టుబడిపోతే ఎకరాకు రూ.50 వేల వరకు లాభం వచ్చే అవకాశముంది.
తేమశాతం ఎనిమిది లోపే ఉండాలి
సీసీఐ నింబంధనల ప్రకారం క్వింటాలుకు కనీస మద్దతు ధర దక్కాలంటే తేమ 8 శాతంలోపే ఉండాలి. అప్పుడే మద్దతు ధర వర్తిస్తుంది. లేదంటే ఒక్కోశాతం పెరిగినాకొద్దీ ధర తగ్గుతుంది. 12శాతానికి మించి తేమ ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లే రైతులు ఏసెంటర్‌కు వెళ్తున్నామో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. విక్రయించిన దిగుబడికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేస్తారు.
కొనుగోలు కేంద్రాల ఆలస్యంతో..
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం ఆలస్యం కావడంతో ఇప్పటికే పలు మండలాల్లోని రైతులు పత్తిని దళారులకు అమ్మేశారు. వర్షాలు కురుస్తుండడం, పంటపైన పత్తి మొలకెత్తే ప్రమాదం ఉండడంతో వెంటవెంటనే చేనునుంచి తీసి, ఇప్పటికే 30శాతానికిపైగా పంటను దళారులకు విక్రయించారు. క్వింటాలుకు రూ.5,400 నుంచి రూ.6,300 వరకే చెల్లించిన వీరు ధరతో పాటు తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
సీసీఐ కేంద్రాలివే..
తిరుమల ట్రేడింగ్ కంపెనీ నందిగామ, హరిహర జిన్నింగ్, ప్రెస్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నందిగామ, తుల్జాభవాని కాటెక్స్ నందిగామ, ఎన్‌టీటీ కాటన్ ఇండస్ట్రీస్, కిసాన్ జిన్నింగ్, ప్రెసింగ్ ఇండస్ట్రీస్ ఆకుతోటపల్లి, శ్రీఅభిషేక కాటన్ మిల్స్ పోలేపల్లి, శ్రీనివాస్ మురుగన్ ఇండస్ట్రీస్ తలకొండపల్లి.
క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర
తేమశాతం 12దాటితే సీసీఐ కొనుగోలు చేయదు
వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 18005995779
సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించండి
పత్తి పండించిన రైతులు సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించాలి. దళారులకు అమ్మి నష్టపోవద్దు. ఎనిమిది శాతంలోపు తేమ ఉండేలా చూసుకోవాలి. రైతులందరూ ఒకేసారి వచ్చి రోజుల తరబడి ఇబ్బంది పడకుండా స్లాట్ బుకింగ్ అవకాశం కల్పిస్తున్నాం. నాలుగైదు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తాం.
– ఉష, జిల్లా వ్యవసాయాధికారి