
శంకర్‌పల్లిలో డ్రోన్ కలకలం
● అనుమతి లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వీడియో చిత్రీకరణ
● ఆపై సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్
● దేశ రక్షణకు భంగం కలిగించే చర్యలని పలువురి మండిపాటు
శంకర్‌పల్లి: పట్టణంలో ఆదివారం అనుమానాస్పదంగా ‘డ్రోన్’ ఎగరడం కలకలం రేపింది. కొంత మంది వ్యక్తులు ఎలాంటి అనుమతి లేకుండా నిషేధిత జాబితా ఉన్న ప్రాంతాలను సైతం డ్రోన్‌తో వీడియో చిత్రీకరించారు. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండగ ముందు రోజు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు శంకర్‌పల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, తహసీల్దార్, ఎంపీడీఓ, మార్కెట్, సంగారెడ్డి జిల్లాలో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థలు ఓడీఎఫ్(ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ), బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్)లను డ్రోన్‌తో చిత్రీకరించారు. ఆపై తెలంగాణ యాసలో ఉన్న ఓ పాటను కలిపి ‘మన శంకర్‌పల్లి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో(యూట్యూబ్, ఇన్‌స్ట్రాగాం, ఫేస్‌బుక్) అప్‌లోడ్ చేశారు. ఇది వైరల్ కావడంతో చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నారు. అయితే కేంద్ర రక్షణ రంగసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను తీయడం కచ్చితంగా దేశ రక్షణకు భంగం కల్గించడమే అని, ఈ చర్య ద్వారా ఇతరులకు మన సమాచారం సులభంగా చేరుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారనే కారణంతో ప్రస్తుత సీఎం రేవంత్‌త్‌రెడ్డిపై 2020 మార్చి 2న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసు సైతం శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడలోనే చోటు చేసుకోవడం గమనార్హం.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేయడంపై శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ను వివరణ కోరగా కేంద్ర రక్షణ సంస్థలు నిషేధిత జాబితాలో ఉంటాయని, ఆయా సంస్థల ప్రతినిధులు దగ్గర్లోని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.