
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అక్షయ
తుక్కుగూడ: రాష్ట్రస్థాయి కబడ్డీ అండర్–14 విభాగంలో మున్సిపల్ కేంద్రంలోని బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని అక్షయ ఎంపికై ంది. ఈ సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి 18వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్స్‌పాల్ కె.వెంకటరామచారి, కబడ్డీ కోచ్ వంగా శ్రీధర్‌రెడ్డి, పీఈటీ సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆస్తితగాదాలో కత్తిపోట్లకు గురైన వ్యక్తి మృతి
మొయినాబాద్‌రూరల్: ఆస్తి తగాదాల కారణంగా కత్తిపోట్లకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈ నెల 11న సురంగల్ గ్రామం కొట్రాస్‌లలో ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో రామగళ్ల శ్యామ్(45)తో సోదరుడు నందు, సావిత్రి దంపతులతో పాటు వీరి కుమారుడు ప్రసాద్ గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రసాద్ కత్తితో దాడి చేయడంతో గాయపడిన శ్యామ్‌ను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ప్రసాద్‌తో పాటు అతని తల్లిదండ్రులను 12వ తేదీన రిమాండ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుడుగురువారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తల్లిదండ్రులపై కత్తితో తనయుడి దాడి
మణికొండ: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు తల్లి దండ్రులపై కత్తితో దాడి చేసిన సంఘటన గండిపేటలోని ఈఐపీఎల్ అపిల గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. నార్సింగి ఎస్సై గోపి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. భారతి, రవీందర్‌రెడ్డి దంపతుల కుమారుడు రఘుపాల్‌రెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. గత కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు మానసిక వైద్యుడికి చూపించాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న అతను తనకు ఏమి కాలేదని, అనవసరంగా మానసిక రోగిగా ముద్ర వేస్తున్నారనే కోపంతో బుధవారం రాత్రి ఇంట్లో కూరగాయాలు కోసే కత్తితో వారిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా గత కొంత కాలంగా తమ కుమారుడు మతి స్థిమితం కోల్పోయాడని, అతడి డాక్టర్‌కు చూపిస్తామని చెప్పినందుకు తమపై దాడి చేశాడని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని యువకుడి మృతి
అనంతగిరి: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బంట్వారం మండలం మోత్కుపల్లికి చెందిన శ్రీనివాస్(26) కొంత కాలంగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కాగా అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి సమీపంలో నివాసం ఉండే తన స్నేహితున్ని బైక్‌పై ఇంటి వద్ద వదిలిపెట్టాడు. అనంతరం తిరిగి వికారాబాద్‌కు వస్తున్న క్రమంలో మర్రి చెన్నారెడ్డి విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ గత 18 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాస్‌కు భార్య, బాబు ఉన్నారు. మృతుడి తండ్రి అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీంకుమార్ తెలిపారు.
వేరుశనగ విత్తనాల డీసీఎం బోల్తా
దోమ: వేరుశనగా విత్తనాల బస్తాలు తీసుకెళ్తున్న ఓ డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటన దోమ మండల పరిధిలోని మోత్కూర్ శివారులో చోటుచేసుకుంది. మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి రైతు వేదికకు 18 క్వింటాళ్లు(90 బస్తాలు)సబ్సిడీ వేరుశనగ రావాల్సి ఉంది. అయితే బుధవారం మహబూబ్‌నగర్ బయల్దేరిన డీసీఎం దుద్యాల మండలంలో కొంత మేర ఖాళీ చేసి మిగతా లోడ్‌తో దాదాపూర్, కుల్కచర్ల, మోత్కూర్ మీదుగా బ్రాహ్మణపల్లి వెళ్తుండగా అదుపుతప్పి మోత్కూర్ గేట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, అందులో ఉన్న 90 బస్తాల వేరుశనగా విత్తనాలు నీటిలో పడి తడిసి ముద్దయ్యాయి. ఇది గమనించిన కొంతమంది సుమారు 20 బస్తాల వరకు ఎత్తుకెళ్లారు.