
ప్రైవేట్ బస్సు బీభత్సం
టైర్ పేలడంతో ఘటన
● డివైడర్ అవతలి వైపు ఉన్న బొలెరోను ఢీకొట్టిన వైనం
రాజేంద్రనగర్: హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. 100 కిలో మీటర్ల వేగంతో వెళుతున్న బస్సు టైర్ పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలిపై వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అటుగా వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టి 10 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్ బస్సు గచ్చిబౌలి ప్రాంతంలో ప్రయాణికులను దింపి ఔటర్ మీదుగా ఎగ్జిట్ 17 నుంచి రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాకు వెళ్లాల్సి ఉంది. ఉదయం అప్పా నుంచి హిమాయత్‌సాగర్‌కు వస్తుండగా బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించే క్రమంలో ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి విద్యుత్ స్తంభంతో పాటు చెట్లను ఢీకొని రోడ్డు అవతలివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో శంషాబాద్ కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు అన్‌లోడ్ చేసి వెళుతున్న బొలెరోను ఢీకొట్టి రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. రోడ్డు పక్కనే ఉన్న బారికేడ్లను ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌తో పాటు బస్సు డ్రైవర్ అందులోని 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే గాయాలతో ఉన్న డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. బొలెరో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు.