ప్రత్యేకం.. అస్తవ్యస్తం
తుర్కయంజాల్: జిల్లాలో బడంగ్‌పేట్, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లతో పాటు తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, మణికొండ, నార్సింగి, శంకర్‌పల్లి, కొత్తూరు, ఆమనగల్లుతో పాటు నూతనంగా ఏర్పడిన మొయినాబాద్, చేవెళ్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో దేనికి కూడా పాలకవర్గాలు లేవు. గడువు ముగిసినప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా వారు ఆయా మున్సిపాలిటీలపై దృష్టి సారించలేకపోతున్నారు. వీరి చేతుల్లోకి పాలన వచ్చి నెలలు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోలేకపోతున్నారు. కార్యాలయాలకే పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఫైళ్లపై సంతకాల కోసం ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది ప్రత్యేకాధికారుల కార్యాలయాల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేకాధికారులు పని ఒత్తిడిలో బిజీగా ఉండటంతో కొందరు కమిషనర్లు, ఇతర సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుబాటులో ఉండకపోవడం, సకాలంలో కార్యాలయాలకు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటి నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ క్లియరెన్స్ విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని రుజువు చేస్తూ ఇటీవల నార్సింగి టీపీఓ మణిహారిక ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్, మ్యూటేషన్లు, ట్రేడ్ లైసెన్స్ జారీలో సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా చోట్ల దరఖాస్తుదారులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చేయి తడిపితే కానీ ఫైలు ముందుకు కదలని దుస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు.
మేయర్‌లు, ఉప మేయర్‌లు, చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కార్పొరేటర్‌లు, కౌన్సిలర్లు ఆయా వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. గడువు ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలకు ఎప్పుడు వెళ్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారా లేక గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు, నాలుగు కార్పొరేషన్‌లుగా విభజిస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూస్తే తప్ప భవిష్యత్తు ఏమిటనేది తేలేలా లేదు. జీహెచ్‌ఎంసీ పదవీ కాలం ముగిసే వరకు కూడా శివారు ప్రాంతాలకు ప్రత్యేకాధికారుల పాలన తప్పదు.
అధికారుల తీరుపై ఆరోపణలు
జీహెచ్‌ఎంసీ పదవీ కాలం ముగిసే వరకు..
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే
పాలకవర్గాల గడువు ముగిసి ఇప్పటికే 233 రోజులు
కార్యాలయాలకే పరిమితమైన ప్రత్యేక అధికారులు
క్షేత్రస్థాయిలో కరువైన పర్యవేక్షణ.. సేవలకు ఆటంకం
కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ముగిసి ఇప్పటికే 233 రోజులు పూర్తయింది. పాలకవర్గాల స్థానంలో ప్రత్యేక అధికారులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్‌లు, ఆర్డీఓ స్థాయి అధికారులను నియమించారు. దీంతో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.