
ఔటర్‌పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: రోజు వారీ పనుల్లో అలసిన కార్మికులు సేదతీరుదామనుకున్నారు. సరదాగా వెళ్లిన వారి ప్రయాణాన్ని మృత్యువు వెంటాడింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి ఆది బట్ల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రవి కుమార్, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన రాజేంద్ర కీసర మండలం బోగారంలో బిల్డర్. అతని వద్ద వినుకొండకు చెందిన శివకోటి(27), పొందూరుకు చెందిన కాంత్రికుమార్, శ్రీహరి, మహేశ్‌వర్మ, రామకృష్ణ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వారంతా కలిసి రోజు పనుల్లో అలసిపోతున్నాం.. సరదాగా ఎయిర్‌పోర్టు చూసొద్దామని నిర్ణయించుకున్నారు. రాత్రి భోజనం పూర్తి చేసుకుని కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై బొంగ్లూరు జంక్షన్ సమీపంలో ఎగ్జిట్ 13–12 మధ్య శ్రీశ్రీ ఎరోసిటీ సమీపంలో మూత్ర విసర్జన కోసం పార్కింగ్ లైట్లు వేసి కారు నిలిపారు. ఇద్దరు కా రులో కూర్చోగా మరో నలుగురు కారు ఎదుట ఉన్నారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టి ముందు మూత్రవిసర్జన చేస్తున్న వారిపైకి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివకోటి అక్కడికక్కడే మృతి చెందగా బిల్డర్ పరి స్థితి విషమంగా ఉంది. రామకృష్ణ, శ్రీహరి, క్రాంతికుమార్ పరిస్థితి 24గంటలు గడిస్తేనే చెప్పగలమన్నారు. మహేశ్‌వర్మకు స్వల్పగాయాలయ్యాయి. మృతుడు, క్షతగాత్రులంతా దగ్గరి బంధువులు. శివకోటి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆగి ఉన్న కారు ఢీకొట్టిన లారీ
ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం
మృతుడు, క్షతగాత్రులు ఆంధ్రప్రదేశ్ వాసులు

ఔటర్‌పై ఘోర ప్రమాదం