
భవిష్యత్ ‘ఏఐ’దే..
మొయినాబాద్: భవిష్యత్ కృత్రిమ మేధస్సుదేనని.. కృత్రిమ మేధస్సును భూ విజ్ఞాన, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతలతో సమన్వయం చేయాలని ఎర్త్ సెన్స్–2025 అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల వక్తలు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ పరిధిలోని కేఎల్‌హెచ్ వర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ‘ఎర్త్‌సెన్స్–2025’అంతర్జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన అర్జెంటీనాకు చెందిన ప్రొఫెసర్ అనాబెల్లా ఫెర్రల్, మలేషియాకు చెందిన ప్రొఫెసర్ నార్మా అలియాస్, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయిలు తమ అభిప్రాయాలను అందరితో పంచుకున్నారు. భూసమీకరణ, పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ మార్పు పరిష్కారాలు, స్థిర వనరుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఆయా అంశాల్లో కృత్రిమ మేథస్సు వినియోగం, భూవిజ్ఞానం, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల పురోగతిపై మూడు రోజుల సదస్సులో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామకృష్ణ, ప్రతినిధులు బోహారీ మహత్, పలువురు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమల నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.