
పార్కు స్థలం పరాధీనం!
విలువైన స్థలాలను కాపాడాలి
ఉపేక్షించేది లేదు
● దర్జాగా ప్రహరీ నిర్మాణం
● రూ.12 కోట్ల విలువైన భూమి కబ్జా
● ఆదిబట్లలో అక్రమార్కుల నిర్వాకం
ఇబ్రహీంపట్నం రూరల్: పంచాయతీలుగా ఉన్నప్పుడు కాపాడిన పార్కు స్థలాలు మున్సిపాలిటీలోకి చేరే సరికి మాయమైపోతున్నాయి. అధికారుల ఉదాసీన వైఖరితో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, లేఔట్లు మార్చేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడక ముందు 2017లో శ్రీమిత్ర ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం సర్వే నంబర్ 72,73,74,75,76,77 పార్టుల్లో పార్కు స్థలాలను కేటాయించింది. మొత్తం 49.30 ఎకరాలు వెంచర్ చేయగా అందులో నిబంధనల ప్రకారం ఐదెకరాల పార్కు స్థలాలు చూపించారు. 2012లో పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని అప్పటి జిల్లా పంచాయతీ అధికారి పద్మజారమణ స్థలాలను రక్షించాలని ఆదేశించారు.
ఫిర్యాదు చేసినా స్పందన అంతంతే..
ప్రస్తుతం మరియపురానికి దగ్గరలో వైపీఆర్ వెంచర్‌కు వెళ్లే దారిలో అక్రమార్కులు కబ్జా చేశారు. సుమారు 2,400 గజాలకు పైగా కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీనిపై అనేకమార్లు కలెక్టర్, సీడీఎంఏ, డీటీసీపీ కార్యాలయాల్లో స్థానికులు పలువురు ఫిర్యాదు చేశారు. ఎలాంటి విచారణ చేయకుండా స్థానికంగా ఉండే టౌన్‌ప్లానింగ్, మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రూ.12 కోట్ల విలువైన భూమి కబ్జా చేసినా పట్టించుకునే నాథుడే లేడని, కంటితుడుపు చర్యగా ప్రహరీ లోపల ఎవ్వరికీ కనిపించకుండా చిన్నబోర్డు పాతి వదిలేశారని పేర్కొన్నారు. అక్రమార్కుల కబంధ హస్తల్లో ఉన్న విలువైన భూమికి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
గత పంచాయతీ హయాంలో పార్కు స్థలాలను పంచాయతీకి గిఫ్ట్‌డీడ్ చేశారు. అప్పటి నుంచి కాపాడుతూ వచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక అధికారుల పర్యవేక్షణ కరువైంది. అక్రమార్కులపై కేసులు పెట్టి విలువైన స్థలాలను కాపాడాలి.
– పల్లె రజినీకాంత్‌గౌడ్, ఆదిబట్ల
టీసీఎస్ ముందున్న రియల్ ఎస్టేట్ సంస్థలో పార్కు స్థలం కబ్జాకు గురైన విషయం తెలిసింది. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే ప్రహరీలో బోర్డు ఏర్పాటు చేశాం. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తాం.
– బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదిబట్ల

పార్కు స్థలం పరాధీనం!

పార్కు స్థలం పరాధీనం!