
విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవద్దు
హైకోర్టు న్యాయమూర్తి నర్సింగ రావు
శంకర్‌పల్లి: న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోవద్దని హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నర్సింగ రావు అన్నారు. శుక్రవారం రాత్రి శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలో ఇక్ఫాయ్ డిమ్డ్ విశ్వవిద్యాలయం ‘లా స్కూల్’ ఆధ్వర్యంలో ఎన్.జె.యశస్వీ మెమోరియల్ 10వ మూట్ కోర్టు పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీల్లో.. దేశంలో పేరుగాంచిన 37 లా కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కళాశాల దశలో ఏర్పాటు చేసిన ఈ మూట్ కోర్టు పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కూల్ డైరెక్టర్ డా.రవిశేఖర రాజు మాట్లాడుతూ.. పాఠశాలలో చేపడుతున్న కార్యక్రమాలు, వాటివిశిష్టతను వివరించారు. కార్యక్రమంలో స్కూల్ డీన్ ప్రతాప రెడ్డి, టోర్నీ కొ– ఆర్డినేటర్ డా.టి.హిమావతి తదితరులు పాల్గొన్నారు.