
పీఓటీ అస్త్రం!
మహేశ్వరంలో..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసైన్డ్ భూముల్లోని అగ్రిమెంట్లపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. కొంత మంది రియల్టర్లు తమ పట్టా భూముల పక్కనే ఉన్న అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అసైన్డ్ దారులతో లీజు ఒప్పందం రాసుకుంటున్నారు. తర్వాత ఆయా భూములను తమ పట్టాభూముల్లో కలిపేసి గుట్టుగా వెంచర్లు చేస్తున్నారు. మరికొంత మందైతే ఏకంగా తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాటిని పట్టా భూములుగా మార్పించుకుంటున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలోని కొంత మంది రెవెన్యూ అధికారులు సహకరిస్తుండటంతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. నిజానికి అసైన్డ్ భూములను అమ్మడం కానీ కొనడం కానీ నేరం. ఎవరైనా క్రయవిక్రయాలకు పాల్పడితే.. ప్రభుత్వం పీఓటీ (అసైన్డ్ లాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్) యాక్ట్–1977 కింద తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా అధికారులు ఇటీవల ఈ చట్టానికి పదును పెడుతున్నారు. అసైన్డ్ భూములు అమ్మినట్లు, కొన్నట్లు ఏమాత్రం తెలిసినా వెంటనే నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మహేశ్వరం మండలం మంఖాల్‌లో 23.22 ఎకరాలను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.. తాజాగా మరికొంత మందికి నోటీసులు జారీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఇప్పటికే ఆయా భూములను కొనుగోలు చేసిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాగన్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 189 అనాజీపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 281లోని అసైన్డ్ భూములపై రియల్టర్ల కన్నుపడింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ భూములను గుట్టుగా కొనుగోలు చేసిన విషయం తెలిసి రెవెన్యూ అధికారులు పీఓటీ కింద నోటీసులు జారీ చేశారు. హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ సర్వే నంబర్ 52/8లోని 25 ఎకరాలు ఇప్పటికే చేతులు మారినట్లు గుర్తించారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు జారీ చేసిన అప్పటి మండల రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్లపై చర్యలకు సిఫార్సు చేశారు. హయత్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 242లోని ఐదు ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ భూములను బస్ టెర్మినల్ కోసం కేటాయించారు.
చేవెళ్లలో..
చేవెళ్ల డివిజన్ పరిధిలోని పెద్దవీడు, మద్దూరు, సోలిపేట్ గ్రామాలు సహా శంకర్‌పల్లి మండలాల్లో వంద ఎకరాలకుపైగా పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మెయినాబాద్ మండలం అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 177, 176లోని 30 ఎకరాలు, కనకమామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 51, 510లోని దాదాపు 50 ఎకరాలు, తోల్‌కట్ట రెవెన్యూ సర్వే నంబర్లు 142,143, 85లోని పది ఎకరాలపై రియల్టర్ల కన్నుపడింది. పదేళ్ల క్రితమే ఈ భూములు చేతులు మారాయి. విషయం తెలిసి అప్పట్లోనే రెవెన్యూ యంత్రాంగం పీఓటీ కింద వెనక్కి తీసుకుంది. తర్వాత మళ్లీ ఆయా భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయి. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 632లోని 58 ఎకరాల అసైన్డ్ భూములపై కూడా రియల్టర్లు కన్నేశారు. ఈ భూములను పీఓటీ కింద స్వాధీనం చేసుకుని అప్పట్లోనే హెచ్‌ఎండీఏకు అప్పగించారు. శంకర్‌పల్లి మండలం మోకిల రెవెన్యూ పరిధి సర్వే నంబర్లు 96,197లలో 63.6 ఎకరాలను పీఓటీ కింద స్వాధీనం చేసుకుని హెచ్‌ఎండీఏకు అప్పగించారు. పది ఎకరాలు అర్బన్ ఫారెస్ట్రీ నర్సరీగా అభివృద్ధి చేసి, మిగిలిన భూములు హెచ్‌ఎండీఏ అధీనంలో ఉన్నాయి.
మంఖాల్ రెవెన్యూ సర్వే నంబర్ 70లోని 8.28 ఎకరాలు, సర్వే నంబర్ 71లోని 6.01 ఎకరాలు, సర్వే నంబర్ 73లోని 4.35 ఎకరాలు, సర్వే నంబర్ 85లోని 1.34 ఎకరాలు, సర్వే నంబర్ 86లోని 1.24 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. 40 ఏళ్ల క్రితమే 12 మంది రైతులకు అప్పటి ప్రభుత్వం అసైన్డ్ చేసింది. ఈ భూములపై ఓ ప్రముఖ రియల్టర్ కన్నేశాడు. రైతులకు డబ్బుల ఆశ చూపి, పక్కనే ఉన్న తమ పట్టా భూముల్లో కలిపేశాడు. ఎక్కడ దొరికి పోతామోనని వెంచర్ మధ్యలో ఉన్న భూములను ఇచ్చిన ఆయా రైతులకు మరో చోట పొజిషన్ చూపించారు. తీరా ఆ భూములు అసైన్‌దారులకు దక్కకుండా మరికొంత మంది కబ్జా చేశారు. ఇటీవల ఇదే అంశంపై పెద్ద ఎత్తున వార్తా కథనాలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా సర్వే నంబర్లలోని 23.22 ఎకరాల అసైన్డ్ భూములను పీఓటీ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.