
తూర్పు–పడమర కలిసేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇండియాకే తలమానికంగా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలను సాకారం చేసే దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఫోర్త్ సిటీని కేవలం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ ఎగుమతులకు వీలుండేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తూర్పున శ్రీశైలం హైవే (ఎన్‌హెచ్–765) నుంచి పశ్చిమాన ఉన్న నాగార్జున సాగర్ హైవే (స్టేట్ హైవే–19) వరకూ గ్రీన్‌ఫీల్డ్ ట్రంక్ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదిత రహదారి వయా ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్తుంది. గతంలోనే కందుకూరు నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. మీర్‌ఖాన్‌పేట నుంచి నందివనపర్తి మీదుగా యాచారం మండలం కేంద్రంలోని నాగార్జునసాగర్ హైవేకు లింకు చేసే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. మీర్‌ఖాన్‌పేటలో స్కిల్స్ యూనివర్సిటీ, ఎఫ్‌సీడీఏ కార్యాలయం, ఏటీసీ సెంటర్ సహా పలు సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఈ లింక్ రోడ్డుకు ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో రావిర్యాల ఔటర్ ఎగ్జిట్ నుంచి ప్రతిపాదించి 330 అడుగుల రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి కూడా ఇక్కడి నుంచే ముందుకు సాగుతున్నందున.. ఈ ప్రాంతం అన్నింటికీ హబ్‌గా మారుతుందని అంచనా వేస్తోంది.
భూ సేకరణ ఇబ్బందులు లేకుండా..
ఫ్యూచర్ సిటీలో అత్యంత కీలకం మౌలిక సదుపాయాల అభివృద్ధే. అందుకే భవిష్యత్తు నగరి చుట్టూ గ్రీన్‌ఫీల్డ్ రహదారులను నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీశైలం హైవేను సాగర్ హైవేతో అనుసంధానించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ రోడ్డును నిర్మించనుంది. ఈ కారిడార్ ఎఫ్‌సీడీఏ కింద అభివృద్ధి చేస్తున్న కీలక పారిశ్రామిక ప్రాంతాల గుండా వెళ్తుంది. దీంతో సమతుల్య పట్టణ వృద్ధి సాధ్యమవుతుంది. ప్రణాళికాబద్ధమైన పట్టణ పారిశ్రామిక ప్రాంతంలో ప్రధానమైన క్రాస్ యాక్సెస్‌కు అవకాశం కల్పిస్తుంది. తూర్పు–పడమర ట్రంక్ రోడ్డు పారిశ్రామిక మండలాలు, లాజిస్టిక్స్ హబ్‌లు, నివాస ప్రాంతాలను కలుపుతుంది. భూ సమీకరణ ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చెందని, ప్రభుత్వ యాజమాన్యంలోని భూమిని ఉపయోగిస్తూ ఈ రహదారిని నిర్మించనున్నారు.
శ్రీశైలం హైవే టు సాగర్‌హైవే వరకు ట్రంక్ రోడ్డు నిర్మాణం
సిగ్నల్ రహిత జంక్షన్లు, ఇంటర్ ఛేంజ్‌లతో పటిష్టమైన వ్యవస్థ
సరుకు రవాణా, మెట్రో కనెక్టివిటీలతో మెరుగైన మౌలిక సదుపాయాలు
తగ్గనున్న రద్దీ భారం
ఈ రోడ్డు తూర్పు–పశ్చిమ ప్రాంతాలను అనుసంధానం చేయడంతో పాటు ఆయా ప్రాంతాలు, రహదారులలో రద్దీని తగ్గిస్తుంది. అలాగే చుట్టుపక్కల రోడ్డు నెట్‌వర్క్‌లపై భారాన్ని తగ్గిస్తుంది. మల్టీ మోడల్, హైస్పీడ్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. సున్నితమైన, అంతరాయం లేని ప్రయాణం సాగించేలా ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు. వంకలు లేకుండా, మెరుగైన విజబులిటీ, ప్రధాన జంక్షన్లలో ఎత్తయిన విభాగాలు, హైస్పీడ్ కదలికలను నిర్ధారించే డిజైన్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తు సామూహిక రవాణా వ్యవస్థలు, యుటిలిటీ కోసం ప్రత్యేక స్థలాలతో పటిష్టమైన మౌలిక సదుపాయాలతో ఉంటుంది. ట్రాఫిక్ ఫ్లో, యాక్ససబులిటీ కోసం ప్రధాన క్రాసింగ్ పాయింట్ల వద్ద ఇంటర్‌ఛేంజ్‌లను ప్రతిపాదించారు. నగరాల మధ్య వేగవంతమైన వాహన కదలికలు, సరుకు రవాణా, మెట్రో కనెక్టివిటీతో పాటు సిగ్నల్ రహిత జంక్షన్లతో సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాల విస్తరణను సులభతరం చేస్తుంది.