
కాలువలు కబ్జా!
అధికారులకు సూచించాం
పూర్తిగా నిండి ప్రమాద స్థాయికి చేరిన చిలుకూరు పెద్ద చెరువు
జీవన్‌గూడ రోడ్డుపై ప్రవహిస్తున్న మాలకుంట అలుగునీరు
మొయినాబాద్: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం.. అధికారుల నిర్లక్ష్య వైఖరి చిలుకూరు గ్రామానికి ప్రమాదం తెచ్చిపెట్టింది. చెరువు నిండి బ్యాక్‌వాటర్‌తో పంటలు మునిగి నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతుండగా.. నీళ్లు కిందికి వదిలితే ఇళ్లు కొట్టుకుపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు సమీపంలో పెద్ద చెరువు ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి 69 ఎకరాల్లో విస్తరించి ఉంది. చెరువు కింద ఆయకట్టు సైతం ఉంది. గతంలో చెరువుకు రెండు తూములు, అలుగు ఉండేవి. అలుగు కింది భాగం నుంచి రోడ్డు ఉండడంతో అలుగుపై మట్టి పేరుకుపోయింది.
అలుగు కంటే అడుగు ఎత్తులో రోడ్డు నిర్మాణం
హిమాయత్‌నగర్– తంగడపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు చిలుకూరు పెద్ద చెరువు కట్ట పైనుంచి ఉంది. గతంలో రోడ్డు వేసే క్రమంలో అధికారులు పెద్ద చెరువు అలుగు వద్ద ఒక అడుగు మేర ఎత్తు పెంచి నిర్మాణం చేపట్టారు. దీంతో అలుగుపై సైతం మట్టి పేరుకుపోయి ఒక అడుగు ఎత్తు పెరిగింది.
ఆయకట్టులో ఇళ్ల నిర్మాణం
పెద్ద చెరువు ఆయకట్టులో కొన్నేళ్లుగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. చెరువు కట్ట కింది భాగంలోనే ప్లాట్లు చేయడంతో కొనుగోలు చేసినవారు ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పట్లో అలుగు నుంచి కిందికి వెళ్లే నీళ్లు కాలువ ద్వారా గండిపేట చెరువులోకి చేరేవి. అలుగు నీళ్లు వెళ్లే కాలువను పూడ్చేసి రోడ్డు వేశారు. దీంతో చెరువు నిండితే కిందికి వెళ్లడానికి కాలువలేకుండా పోయింది. ప్రస్తుతం రోడ్డుపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాద స్థాయికి చేరిన చెరువు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తి స్థాయిలో నిండింది. రోడ్డు నిర్మాణంతో అలుగు ఎత్తు ఒక అడుగుకు పైగా పెరగడంతో అదే ఎత్తుకు నీళ్లు చేరి రోడ్డుపైనుంచి ప్రవహిస్తున్నాయి. 69 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధి దాటి 100 ఎకరాల వరకు బ్యాక్ వాటర్ చేరింది. బ్యాక్ వాటర్‌లో రైతుల పంటలు మునిగిపోయాయి. మూడు రోజుల క్రితం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ చెరువును పరిశీలించి శాశ్వత పరిష్కారం కోసం నాలా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఎనికేపల్లి మాలకుంట నిండడంతో..
మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లిలో ఉన్న మాలకుంట పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. అలుగు కింది భాగంలో మాలకుంట నుంచి బంగాలి కుంటలోకి నీరు వెళ్లేందుకు కాలువ ఉండేది. ఆ కాలువను గతంలో రియల్ వ్యాపారులు కబ్జాచేసి ప్రహరీ నిర్మించారు. దీంతో అలుగు నుంచి వెళ్తున్న వరద నీరంతా జీవన్‌గూడ వెళ్లే రోడ్డుపై ప్రవహిస్తూ పంటచేలల్లోకి వెళ్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చిలుకూరు పెద్ద చెరువు అలుగు వద్ద రోడ్డు ఎత్తును తగ్గించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించాం. అలుగు నీరు వెళ్లేందుకు వీలుగా నాలా నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎనికేపల్లి మాలకుంట నుంచి బంగాలి కుంటకు అలుగు నీరు వెళ్లే కాలువ కబ్జాకు గురైంది. కాలువను సర్వే చేయాలని మండల సర్వేయర్‌కు లేఖ రాశాం.
– పరమేశ్వర్, ఇరిగేషన్ డీఈ, చేవెళ్ల డివిజన్
చెరువుల నీళ్లు రోడ్లపైకి
బ్యాక్ వాటర్‌లో మునిగిన పంటలు
అధికారుల నిర్లక్ష్యంతో ముంపు ముప్పు

కాలువలు కబ్జా!