
బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
బడంగ్‌పేట్: ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుడిని శనివారం కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి ఆయనను సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మహా గణనాథుని ఆశీస్సులు దేశ ప్రజ లందరిపై ఉండాలని, ప్రధాని మోదీకి మరింత శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్‌గౌడ్, మహేశ్వరం నియోజవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములుయాదవ్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని శంషాబాద్ డీసీపీ రాజేష్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కంసాన్‌పల్లిలో మాజీ వైస్ ఎంపీపీ బసిరెడ్డి నరేందర్‌రెడ్డి సొంత నిధులు రూ.3.50 లక్షలతో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల సమాచారం, అసాంఘిక కార్యకలాపాల సమాచారం పోలీస్ వారికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో గణితం, చరిత్ర బోఽధించే పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం, ఇతరులు 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. పీహెచ్‌డీ, ఎన్‌టీపీ, సెట్, ఎస్‌ఎల్‌ఈటీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 2వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 3న హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
తుర్కయంజాల్: గణనాథుడితో పాటు ఐదు తులాల బంగారు గొలుసు నిమజ్జనం చేసిన సంఘటన తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు వద్ద శనివారం చోటు చేసుకుంది. నగరంలోని హస్తినాపురంలో నివసించే ఓ కుటుంబం ఇంట్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు మాసబ్ చెరువు వద్దకు వచ్చారు. పూజ చేసే సమయంలో వినాయకుడి మెడలో వేసిన ఐదు తులాల బంగారు గొలుసు తీయడం మరిచి జేసీబీ డ్రైవర్‌కు ఇవ్వడంతో అతను చెరువులో నిమజ్జనం చేశాడు. వెంటనే తేరుకున్న వారు నిమజ్జనం పాయింట్ వద్ద ఉన్న అధికారులకు సమాచారం అందించారు. జేసీబీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి నిమజ్జనం చేసిన విగ్రహాలను బయటకు తీయగా గొలుసు దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి