
న్యాయవ్యవస్థపై విశ్వాసం పెంపొందించాలి
ఆమనగల్లు: న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్ అన్నారు. పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జీవన్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు ఆమనగల్లు జడ్జి కాటం స్వరూప, బార్ అసోసియేసన్ అధ్యక్షుడు యాదీలాల్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటిన్, జిరాక్స్ సెంటర్‌ను ప్రారంభించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కరుణకుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో కోర్టు ఏర్పాటుకు అవసరమైన స్థలం సమకూరితే నూతన భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. అదనపు కోర్టు ఏర్పాటుకు సహకరిస్తానని తెలిపారు. షాద్‌నగర్ సబ్‌కోర్టు పరిధిలో ఉన్న ఆమనగల్లు జూనియర్ సివిల్‌జడ్జి కేసులను మహేశ్వరం కోర్టుకు మార్చడానికి హైకోర్టుకు నివేదిస్తానని చెప్పారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జడ్జి కరుణకుమార్‌ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీపీ కార్తీక్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జగన్, లక్ష్మణశర్మ, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులుయాదవ్, సభ్యులు, సీఐలు జానకీరాంరెడ్డి, వేణుగోపాల్, ఎస్‌ఐలు వెంకటేశ్, శ్రీకాంత్, వరప్రసాద్, సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్