
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన అవినీతిమయం
ఆమనగల్లు: ప్రభుత్వం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా అన్ని సౌకర్యాలు పొందుతున్న కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని పీసీసీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు అందించేందుకు అసెంబ్లీకి రావాలని కోరారు. పట్టణంలో శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లపాలన అవినీతి, అక్రమాలతో సాగిందని ఆరోపించారు. కేసీఆర్, అతని కుటుంబ సభ్యుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాదనాన్ని దోచుకున్న కేసీఆర్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. బీఆర్‌ఎస్ నేతలకు దైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాడిలో పెడుతున్నారని చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నన్నట్టు తెలిపారు. ప్రజల అండదండలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర కార్యదర్శి కానుగుల దశరథం, రాష్ట్ర చెంచు యువజన సంఘం అధ్యక్షుడు మండ్లి రాములు, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్