
వారంలోగా డిఫెన్స్ భూములపై నివేదిక
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో గుర్తించిన డిఫెన్స్ భూములకు సంబంధించిన నివేదికలను వారంలోగా అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్వాన్, నాంపల్లి ఎమ్మెల్యేలు కౌసర్ మోహినుద్దీన్, మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌లతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫ్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, షేక్‌పేట్‌లో గుర్తించిన డిఫెన్స్ భూములపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిఫెన్స్ భూముల్లో నిరుపేదలు నివాసముంటున్నందున ప్రభుత్వం 2022 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నాలుగు ప్రాంతాల్లోని ఐదు ప్రదేశాలకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత భూములపై డిఫెన్స్ అధికారులతో చర్చించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రదేశాల నుంచి దరఖాస్తులు అందాయని అన్నారు. డిఫెన్స్ భూములపై నివేదిక అనంతరం ల్యాండ్ వాల్యుయేషన్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.ముకుందరెడ్డి, ఆర్డీఓలు రామకృష్ణ, సాయిరాం, పర్యవేక్షకులు ప్రవీణ్ కుమార్, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరిచందన