
ఓన్లీ ఫారిన్ కరెన్సీ!
విదేశీయులనే టార్గెట్ చేసుకుని నగదు చోరీలు
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా జరిగే, విదేశీయులు పాల్గొనే సదస్సులకు వ్యాపారులు ఎందుకు వెళ్తుంటారు..? తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసమే అని అందరికీ తెలిసిన విషమయే. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి మాత్రం చోరీలు చేయడానికి వెళ్లాడు. కొన్నాళ్లుగా వివిధ మెట్రో నగరాల్లో పంజా విసిరిన ఇతగాడు ఎట్టకేలకు ఇటీవల బెంగళూరు పోలీసులకు చిక్కాడు. విచారణ నేపథ్యంలో తాను చేసిన నేరాల చిట్టా బయటపెట్టాడు. నగరానికి చెందిన శ్రీనివాస్ చిన్న స్థాయిలో రాళ్లు, రత్నాల వ్యాపారం చేసేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు కొన్నాళ్లుగా కొత్త పంథా అనుసరిస్తున్నాడు. ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యాపార సదస్సుల వివరాలు తెలుసుకుంటాడు. ప్రధానంగా విదేశీయులు హాజరయ్యే వాటిని ఎంచుకుంటాడు. ఎంట్రీ ఉచితమైనా, భారీ మొత్తం చెల్లించాల్సి ఉన్నా వెనుకాడకుండా రిజిస్టర్ చేసుకుంటాడు. సదస్సు ప్రారంభానికి ముందే ఆ నగరానికి చేరుకుని ఏఏ దేశాల నుంచి డెలిగేట్స్ హాజరవుతున్నారు? ఎప్పుడు వస్తున్నారు? ఎక్కడ బస చేస్తున్నారు? తదితర వివరాలన్నీ నిర్వాహకుల నుంచే తెలుసుకుంటాడు. ఆ అతిథులు బస చేసే హోటళ్లల్లోనే లేదా వాటికి సమీపంలో ఉన్న హోటల్, లాడ్జిలోనే తాను బస ఏర్పాటు చేసుంటా డు. సదస్సు ప్రారంభమైన దగ్గర నుంచీ శ్రీనివాస్ అక్కడికి వచ్చే విదేశీ డెలిగేట్స్ కదలికల్ని గమనిస్తూ ఉంటాడు. వారు తమ బ్యాగ్స్‌ను ఒక్క నిమిషం వదిలినా చాలు... టక్కున అక్కడికి చేరుకుని వాటిలో ఉన్న విదేశీ కరెన్సీని తస్కరిస్తాడు. సాధారణంగా భోజన విరామ సమయంలోనే ఇది సాధ్యమయ్యేది. సదస్సు వేదిక వద్ద తన ‘పని’ పూర్తికాకపోతే వారు బస చేసిన హోటల్‌కు వెళ్లి తస్కరించేవాడు. ఇతగాడు ఇలా కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా అనేక మెట్రో నగరాల్లో ఫారినర్స్‌ను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయాడు. ఇటీవల బెంళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లోని (ఐఐఎస్సీ) జేఎన్ టాటా ఆడిటోరియం, ప్యాలెస్ రోడ్‌లోని ఓ స్టార్ హోటల్స్‌లో తన చేతివాటం ప్రదర్శించాడు. అక్కడ ఐదు రోజుల పాటు జరిగిన సదస్సుకు హాజరైన శ్రీనివాస్ అమెరికా, తైవాన్, ఆస్ట్రేలియా, లావోస్ నుంచి వచ్చిన అతిథుల నుంచి విదేశీ కరెన్సీ తస్కరించాడు. వీటిపై నాలుగు కేసులు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు ఘటనాస్థలాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా శ్రీనివాస్ నిందితుడనితేలడంతోఅతడు బస చేసిన హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. లగేజీని సోదా చేసిన పోలీసులు 300 అమెరికన్, మూడు వేల తైవాన్, 200 ఆస్ట్రేలియా, 7 వేల లావోస్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. తాను ఏ నగరంలో అయితే విదేశీ కరెన్సీని చోరీ చేస్తానో అక్కడే ఉన్న దళారుల ద్వారా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటానని శ్రీనివాస్ వెల్లడించాడు. ఇతడు ఇతర నగరాల్లో చేసిన నేరాలపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆన్‌లైన్ ద్వారా వారు హాజరయ్యేసదస్సుల గుర్తింపు
దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో నగర వ్యాపారి పంజా
ఎట్టకేలకు ఇటీవల అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు