
అధ్యక్షా.. సమస్యలివి!
శ్రీశైలం జాతీయ రహదారిపై చర్చిస్తారా?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార, ప్రతిపక్ష శాసనసభ్యులు జిల్లాకు చెందిన పలు ప్రధాన సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ అంశం ఎల్బీనగర్ ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించనుండగా.. మూసీ సుందరీకరణ, ఆక్రమణ దారులకు పునరావాసం కల్పన వంటి అంశాలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ లేవనెత్తే అవకాశం ఉంది. శేరిలింగంపల్లిలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, అభివృద్ధి పథకాలు, రేషన్‌కార్డుల జారీ వంటి అంశాలను ఆ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సభ దృష్టికి తెచ్చే అవకాశం ఉంది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు ఫార్మాసిటీ రద్దు, జిల్లాలో యూరియా కొరత, రైతుల ఇబ్బందులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లు, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపులో అన్యాయాన్ని ప్రశ్నించనున్నారు.
‘లక్ష్మీదేవిపల్లి’ చర్చకు వచ్చేనా..?
షాద్‌నగర్ నియోజకవర్గంలోని రైతులకు ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. పదేళ్ల క్రితమే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థా పన చేసినప్పటికీ అడుగు ముందుకు పడడం లేదు. నిధుల లేమి ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది. ప్రస్తు త సమావేశాల్లో చర్చకు వస్తుందో లేదో చూడాలి. కొత్తూరు, షాద్‌నగర్, నందిగామ పారిశ్రామికవా డల్లో కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది. తర చూ ప్రమాదాలు వెలుగు చూస్తున్నాయి. కాలుష్య కారక పరిశ్రమలను కట్టడి చేసే అంశం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. మారుమూల తండాలు, గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేకపోవడం, ఉన్నవి ఎక్కడికక్కడ గుంతలు తేలి ప్రమాదకరంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగ్ పొందిన పలువురు టీచర్లు తర్వాత దూరభారం పేరుతో డిప్యూటేషన్లపై మరో చోటికి వెళ్లిపోతున్నారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అక్రమ డిప్యూటేషన్ల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
బీజాపూర్ రోడ్డుకు బీజం పడుతుందా..?
చేవెళ్ల నియోజకవర్గంలోని అప్పా నుంచి మన్నెగూడ జంక్షన్ వరకు విస్తరించిన బీజాపూర్ జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. మూడేళ్ల క్రితం కేంద్రమంత్రి గడ్కరీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాలు 111 జీఓ పరిధిలో ఉన్నాయి. పలు ఆంక్షలు వి ధించడంతో ఈ సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఆర్టీసీ డిపో కోసం ఏళ్ల క్రితమే స్థలం కేటాయించినా ఇప్పటి వరకు ఏర్పడలేదు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెచ్చేందుకే పార్టీ మారాల్సి వచ్చిందని ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య పలుమార్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆయా సమస్యలపై మాట్లాడతారా అనేది వేచి చూడాల్సిందే.
‘పట్నం’ పాట్లు ప్రస్తావిస్తారా?
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నాయి. హెచ్‌ఎండీఏ, ఇతర సంస్థల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో చిన్నచిన్న పనులకు కూడా ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. మంచాల మండలం జాపాల–రంగాపూర్ మధ్య 200 ఎకరాల్లో వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు అంశం అపరిష్కృతంగా మిగిలిపోయింది. శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా సాగునీటి తరలింపు అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఫార్మాసిటీ రద్దు, భూసేకరణలో చోటు చేసుకున్న అక్రమాలు అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లు ప్రభుత్వ కాలేజీలకు సొంత భవనాలు లేవు. భవనాల నిర్మాణ అంశం 25 ఏళ్లుగా కలగానే మిగిలిపోయింది. జిల్లాల పునర్విభజనతో వివిధ కార్యాలయాలు ప్రజలకు దూరమయ్యాయి. పాలమూరు–ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు తాగునీరు అందించే ప్రక్రియ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలనే డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. ఆయా అంశాలు అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తాయో.. లేదో వేచి చూడాల్సిందే.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
జిల్లాలో అపరిష్కృతంగా అనేక సమస్యలు
ఎమ్మెల్యేలు ప్రస్తావించే అవకాశం
పరిష్కారం కోసం జనం ఎదురుచూపు