షాద్‌నగర్: విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటాలని పాఠశాలల క్రీడల, కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తిన చెన్నయ్య అన్నారు. నూర్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న నాగర్‌కర్నూల్ బాలికల డిగ్రీ గురుకుల కళాశాలలో శుక్రవారం క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కరాటే, కుంగ్‌ఫూ విన్యాసాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అన్నారు. ఆత్మరక్షణ కోసం యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శైలజ, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరకత శివ లింగానికి ప్రత్యేక పూజలు
శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప గ్రామంలో వెలసిన 11వ శతాబ్దపు మరకత శివాలయంలోని లింగంపై శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు గ్రామంతో పాటు, చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శివలింగంపై సూర్యకిరణాలు పడడం అరుదని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుక్కుగూడ: జిల్లాలోని 72 పాఠశాలల్లో నాలుగేళ్ల పైబడిన పిల్లల కోసం ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించనున్నట్టు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు అన్నారు. ఈ తరగతులకు గాను విద్యాబోధన చేయడానికి ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు ఇంటర్, ఆయాలు ఏడో తరగతి వరకు చదివి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు సెప్టెంబర్ 6వ తేదీ వరకు జిల్లా విద్యా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల వినియోగంపై నిఘా పెట్టాలి
కొత్తూరు: మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై మరింత నిఘా పెట్టాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ సూచించారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన సిబ్బంది అదనపు గదులను శుక్రవారం ఆయన ప్రా రంభించారు. అనంతరం స్టేషన్ రికార్డుల నిర్వ హణ, కేసుల ఛేదన, నమోదుతో పాటు పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలు ఉండడంతో కొందరు మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీటిపై ఇప్పటికే ఉక్కుపాదం మోపుతుండగా భవిష్యత్తులో పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల ఛేదనలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ నర్సింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.
నూతన నియామకం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే నమో మిషన్ వందే గౌమతరం సంస్థ జిల్లాకు సంబంధించి కీలక నియామకాన్ని చేపట్టింది. ఈ సంస్థ ఆధ్యాత్మిక విభాగానికి గుండల్ దత్తు యాదవ్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించింది. సంస్థ విలువలకు అనుగుణంగా ఆధ్యాత్మికత, సేవా దృక్పథం, సామాజిక సంక్షేమంపై గుండల్ దత్తు యాదవ్ అంకితభావం, నిబద్ధతలకు ఈ నియామకం నిదర్శనమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.